– గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి తెలుసుకోండి !
“మైదా వద్దు .. ప్రొసెస్డ్ ఫుడ్ వద్దు .. జంక్ ఫుడ్ వద్దు .. డబ్బాల్లో పాకెట్స్ సీసాల్లో వచ్చే ఫుడ్ వద్దు .. తెల్లన్నం బాగా తగ్గించండి .. బ్రౌన్ రైస్ , కేరళ రైస్ మంచిది .. అంతకన్నా రాగులు, జొన్నలు, కొర్రలు అండు కొర్రలు , సామలు, అరికెలు మంచివి . ప్లేట్ లో అన్నం ఎంత ఉంటే అంతకు మూడు నాలుగు రెట్లు కాయగూరలు ప్లస్ ఆకుకూరలు ప్లస్ ప్రోటీన్ ఐటమ్స్ ఉండాలి . ఇలా తింటే డయాబెటిస్ రాదు .. వచ్చినా అదుపులో ఉంటుంది . బరువు తగ్గుతారు . బిపి తగ్గుతుంది .. మోకాళ్ళ నొప్పులు లాంటి సమస్యలు తగ్గిపోతాయి .. “…ఈ మాటలు నేను తరచూ చెబుతుంటాను . చాలా మందికి పెద్దగా అవగాహన లేని గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి వివరిస్తాను.
మనం తీసుకొనే ఆహారం నుండి చక్కర { గ్లూకోస్ } ఎంత త్వరగా మన రక్తం లో కలుస్తుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ . 0 నుంచి 100 వరకు ఈ స్కేల్ ఉంటుంది . ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు … త్వరగా బ్లడ్ షుగర్ లెవెల్ ను పెంచుతాయి . ఇన్సులిన్ సేన్సిటివిటి ని దెబ్బ తీస్తాయి . అంటే డయాబెటిస్ కు మొదటి మెట్టు . డయాబెటిస్ వచ్చిన వారు ఇలాంటి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకొంటే మరింత నష్టం కలుగుతుంది .
తాతముత్తాతల బ్యాచ్ : సోషల్ మీడియా లో ఒక బ్యాచ్ ఉంటుంది . ” లక్ష సంవత్సరాలు బతుకుతామా ? కడుపు కట్టుకొని బతకాలా? తాతముత్తాలు ఇలా లెక్కలు వేసుకొని తిన్నారా ? .. హ్యాపీగా తిని ఎంజాయ్ చెయ్యండి ” …. ఇలా సాగుతుంది .. ఈ ఆహార ప్రియుల వాదన . విషయం ఏమిటంటే నలబై ఏళ్ళ క్రితం హై గ్లైసెమిక్ ఫుడ్ పెద్దగా ఉండేవి కావు . తాతముత్తాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ నే తిన్నారు
హై గ్లైసెమిక్ ఫుడ్స్ : గుర్తు పెట్టుకోండి .. నూటికి ఎంత దగ్గరగా ఉంటే ఆహారం అంత చెత్త అన్న మాట . వైట్ బ్రెడ్ – 73 . ఫ్రెంచ్ ఫ్రైస్ – 75 . కార్న్ ఫ్లెక్స్ – 80 . జిలేబి – 95 . మెదు వడ – 80 . వడ పావ్- 80 . సమోసా – 94 . ఉప్మా – 75 . దోస – 60 . పోహా – 65 . చపాతి- 62 . పానీపూరి – 70 . తెల్లన్నం – 73 . బ్రౌన్ రైస్ – 50 . బాసుమతి రైస్ – 50 . జొన్న – 62 . ఇడ్లీ – 85 .
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం కాకర కాయ- 15 . బీన్స్ -16 . బెండకాయ – 14 , సొరకాయ – 14 , పొట్ల కాయ – 12 , కాలిఫ్లవర్ – 10 . ఖీర – 15 . ఒక్క మాటలో చెప్పాలి అంటే కాయగూరల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ . కానీ .. పొటాటో చిలగడదుంప గుమ్మడి కాయ లాంటి వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ 60 – 70 .
సున్నా కావాలా నాయనా! కొన్ని రకాల ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ అసలు ఉండవు . అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ సున్నా . చికెన్ ఫిష్ మటన్ ఎగ్స్ , పుట్టగొడుగులు .. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ సున్నా . అంటే వాటిని ఎంత తిన్నా బ్లడ్ లో షుగర్ పెరగదు .
మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ అవసరమే . కానీ రెండు ముఖ్యమయిన పాయింట్స్ .
1. ఈ కార్బ్స్.. సింపుల్ టైపు కాకూడదు . కాంప్లెక్స్ కార్బ్స్ కావాలి . మైదా , బ్రెడ్ , నాన్ .. బిస్కెట్లు ..ఇవన్నీ సింపుల్ టైపు . అలాగే ప్రొసెస్డ్ ఫుడ్స్ వద్దు. కారణం వీటిలో పీచు ఉండదు . పైగా చక్కర ఇంకా అనేక రకాల రసాయనాలు కలిపివుంటారు .
తినాల్సింది కాంప్లెక్స్ కార్బ్స్ . అందుకే బ్రౌన్ రైస్ .. జొన్నలు అని చెప్పాను.
2. రోజూ వాడే శక్తిలో సగం మాత్రమే కార్బ్స్ ద్వారా ఇవ్వాలి . ఇది ప్రకృతి నియమం . ముప్పై శాతం దాక ప్రోటీన్ ద్వారా ఇవ్వాలి . మిగతావి గుడ్ ఫ్యాట్స్ . జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ మనకు ట్రాన్స్ ఫ్యాట్స్ ని ఇస్తాయి . ఇవి తింటే బాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది . గుడ్ ఫ్యాట్స్ ఇచ్చే ఫుడ్ .. నట్స్ .. వాల్నుట్స్ , కొబ్బరి , వేరుశనిగె .
ఇవి తింటే గుడ్ కొలెస్టరాల్ పెరుగుతుంది . గుండె ఆరోగ్యం . బిపి కంట్రోల్ . ఇక ప్రోటీన్ విషయానికి వస్తే .. మన దేశం లో నూటికి 75 మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు . ప్రోటీన్ తింటే కిడ్నీ లు పోవు . ప్రోటీన్ లేకుండా గిన్నె నిండా కార్బ్స్ .. అదీ సింపుల్ కార్బ్స్ తింటే చక్కర వ్యాధి, ఊబ కాయం, బిపి వచ్చి కిడ్నీ లు పోతాయి . ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉన్న వారు ప్రోటీన్ ఎక్కువ తినకూడదు . ఇది నిజం . క్లుప్తంగా చెబుతాను … మీ ప్లేట్ లో అన్నం ఎంత ఉంటే అంతకు నాలుగు రెట్లు మిగతా ఫుడ్ .. అంటే ప్రోటీన్ ప్లస్ కాయగూరలు ఆకుకూరలు ఉండాలి .
అప్పుడు టాబ్లెట్స్ లేకుండా బతకొచ్చు . బరువు తగ్గిపోతుంది . డయాబెటిస్ సమస్య కాదు . బిపి సమస్య రాదు . పళ్ళ సంగతి ఏంటి ? పుచ్చ – 72 , పైన్ ఆపిల్ – 80 , అరటి పండు – 70 . ద్రాక్ష – 70 , బొప్పాయి -70 , పనస – 80 . ఆపిల్ – 36 , బేరి – 38 ఆరంజ్ – 45 , కివి 53 బ్లూ బెర్రీ – 40 . తీయగా వుండే ఫలాల గ్లైసెమిక్ ఎక్కువ . రెండు ఇడ్లీ లు తినడం కన్నా ఒక అరటి పండు తినడం మిన్న .. ఎందుకంటే ఇడ్లీ లో పోషకాలు తక్కువ. పళ్లలో అంటి ఆక్సిడెంట్స్ ఇంకా పోషకాలు ఎక్కువ . అలాగే రాగి కూడా . రాగి ఇండెక్స్ 80 . కానీ పోషకాలు ఎక్కువ .
ఒక ముక్క పోషక విలువలు లేకుండా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ , ట్రాన్స్ఫాట్స్ , బాడ్ ఫ్యాట్స్ , వుండే ఆహారం పరమ చెత్త . అదే జంక్ ఫుడ్ .. ఫాస్ట్ ఫుడ్ .. ప్రొసెస్డ్ ఫుడ్ . ఇక చివరిగా తాతముత్తాల బ్యాచ్ . వాళ్ళను ఆలా వదిలెయ్యండి . కోట్లు ఖర్చు పెట్టి ఫార్మాసూరులు పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టారు . వారు కూడా బతకాలి కదా మరి . కానీ .. ఓరోరి అయ్యా .. వినరా.. “చావు అందరికీ వస్తుంది . వెయ్యేళ్లు బతుకుతామా ? హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యాలి” అని కబుర్లు చెబుతున్నావు కదా .. రోజు కు గుప్పెడు మాత్రలు మింగుతూ .. లేవలేక .. లేస్తే కూర్చో లేక .. వంగ లేక .. బెంగతో ఆసుపత్రిలో చేరి కాళ్ళు కోయించుకొని రేడియేషన్ పెట్టించుకుని .. పోతావు చూడు .. అది మామూలుగా మామూలుగా ఉండదురో.. నీ సోషల్ మీడియా ఫుడ్డి కబుర్లు నీకు అప్పుడు గుర్తు వస్తాయి . … అప్పుడు చేసేది ఏమీ ఉండదు .
ఎన్నేళ్లు బతుకుతామో మన చేతిలో ఉండదు . ఎలా బతకాలో నిర్ణయించేది మనమే . బతుకుతూ బతికిస్తూ బతకాలా ? లేక చస్తూ బతకాలా ? డిసైడ్ టుడే .
– అమర్నాథ్ వాసిరెడ్డి