– వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు
తాడేపల్లి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదలకు గత వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 50వేల పట్టాలను ఈ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలు నివాసం ఉన్నప్పుడే అది ప్రజా రాజధాని అవుతుందని గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్-5 జోన్‌ను తొలగించడం దారుణమని అన్నారు.
నిన్న చంద్రబాబు అమరావతి పేరుతో దేశ ప్రధానిని పిలిచి రాష్ట్రంలో పెద్ద ఈవెంట్‌ను నిర్వహించారు. చంద్రబాబు నాలుగు సార్లు సీఎం అయినా ఒకటికి రెండు సార్లు ప్రారంభించిన పనులకే మరోసారి శిలాఫలకాలు వేసుకోవడం అలవాటు. చివరికి ప్రధానిని పిలిచి కూడా అదే చేయించారు. 2014-19లో మట్టీ, నీరు తెచ్చి ఇచ్చారంటూ విమర్శించిన ప్రదానినే మరోసారి పిలిచి, గతంలో చేసిన పనులకు శంకుస్థాపన చేయించారు.
ప్రజలకు అందుబాటులో ఉండే రాజధాని అంటే చంద్రబాబు దృష్టిలో ఆయనకు అనుకూలమైన సామాజికవర్గం మాత్రమే ఉండే రాజధాని అని. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి. రాజధాని కూడా అందరి సొంతం. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన దానిని ప్రజారాజధాని అని అనగలమా?