-భస్మాసురుడికి శివుడు వరం ఇచ్చినట్లుగా ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు వరమిచ్చారు
-ఆర్థిక వ్యవస్థను భస్మీపటలం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది
-త్రిమూర్తులు కలిసి నట్టుగా ప్రజల కోసం ఆ మూడు పార్టీలు కలువాలి
-అవినాష్ రెడ్డి అరెస్ట్, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పై కీలకతీర్పులు వెలువడే అవకాశం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. విడదీసి పాలించాలనేది ప్రస్తుత మా పార్టీ అధ్యక్షుడి విధానం. ఎలాగైనా ప్రజలను రక్షించుకోపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందన్న బాధలో ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలనివ్వకుండా, ప్రజలు మరింత నష్టపోకుండా ఉండాలనే ఆశయంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్లుగా కనిపిస్తుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణం రాజు తెలిపారు. వ్యక్తిగత స్వార్ధంతో ఎవరికి వారే యమునా తీరే అంటారా?, లేదా??… మనం ప్రజా సేవ లో ఉన్నామని, ఎవరికి వారి పోరాటం ద్వారా సరైన ఫలితం ఇవ్వదని, ప్రాక్టీకల్ అలోచించాలని సూచించారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చినట్లుగా, ఒక్క ఛాన్స్, తండ్రి లేని పిల్లవాణ్ణి, తన బాబాయిని హత్య చేశారు… తనపై కోడి కత్తితో దాడి చేశారని అంటే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వరం ఇచ్చారు. వరం పొందిన భస్మాసురుడు శివుడి పైనే ప్రయోగించే ప్రయత్నం చేసినట్లుగా, జగన్మోహన్ రెడ్డి ప్రజలపై చెత్త పన్నును వేసి, ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి, మనభూమిలో ఆయన బొమ్మలను వేస్తున్నారు. వరం ఇచ్చిన శివుడికి భస్మాసురుడు అనే రాక్షసుడిని అంతమొందించడానికి శక్తి చాలదనట్లుగా, విష్ణుమూర్తిని ఆశ్రయించాడు.
శివుడు, విష్ణుమూర్తి కలిసి భస్మాసురుడి నెత్తినే వాడి చేయ్యిని వాడి చేత పెట్టించినట్లుగా, వరం ఇచ్చిన ఓటరు దేవుళ్ళు కూడా తెలియక వరం ఇచ్చాం… బ్రహ్మ రాక్షసుడిని కొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు. విష్ణుమూర్తి అవతారం ఎత్తినట్లు గానే అన్ని పార్టీలు కలవాలని కోరుకుంటున్నారు. ఒక పార్టీకి బలం ఉంది సైన్యం లేదు. మరొక పార్టీకి సైన్యం ఉంది, ఇప్పుడు ఉన్న బలాన్ని పోలీసులను పెట్టి కొట్టించి, చంపించి, పార్సిల్ చేసి పంపిస్తున్నారు. దేవతలు ఏకమైనట్టుగానే, వారి భక్తులు కూడా ఏకం కావాలి. త్రిమూర్తులు కలిసినట్లు గానే, రాష్ట్రంలో మూడు పార్టీలు ఏకం కావాలని రఘురామకృష్ణం రాజు కోరారు . రిపబ్లిక్ టీవీ కి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ఇవ్వగా, ఈ విషయం తెలియకుండా యాదృచ్ఛికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులకు లేఖ రాస్తూ పొత్తుల గురించి తనకు వదిలేయండి. జన సైనికులకు, రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అలాగే బిజెపి న్యాయకత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా కంఠక పాలనను దించి వేయాలని ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలోని ఈ పరిణామాలు చోటు చేసుకోవడం శుభసూచకం. ఈ మూడు పార్టీలు కలుస్తాయని తాను గత సంవత్సరన్నర నుంచి చెబుతూనే ఉన్నానని రఘు రామకృష్ణంరాజు గుర్తు చేశారు.
మోడీ స్కీమ్ లు బాగున్నాయి
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పథకాలు బాగున్నాయని, ప్రత్యేక హోదా కోసమే గతం లో ఆయనతో విభేదించినట్లుగా రిపబ్లిక్ టీవీ చేసిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారని రఘురామకృష్ణం రాజు చెప్పారు. ప్రత్యేక హోదా అన్నది అప్పుడు సెంటిమెంట్ గా మారిందని, అందుకే నరేంద్ర మోడీతో విభేదించామని తెలిపారు. రిపబ్లిక్ టీవీ అనేది బిజెపి పక్షపాత ఛానల్. తెలుగులో టీవీ9, ఎన్టీవీ తమ మోహనుడికి ఉన్నట్లుగానే, అది బీజేపీ అనుకూల ఛానల్ అన్నారన్నారు. మోడీ కి అండగా ఉంటామన్న చంద్రబాబు నాయుడు మాటలు, జగనాసురుడికి ఫ్రస్టేషన్ కలిగించాయి. చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇంగ్లీష్ అనేది కేవలం కమ్యూనికేషన్ చేయడానికేనని గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి తెలుగు భాష వింటేనే అసహ్యం కలుగుతుందన్నారు. తెలుగు భాషలో స, ష కు తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇంగ్లీషు భాష గురించి ఆయన మాట్లాడడం విడ్డురంగా ఉంది. తెలుగు భాషలో ఏ పదం సరిగ్గా ఉచ్చరించలేని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ వ్యాకరణం గురించి మాట్లాడడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో పంచతంత్రం కథల గురించి చెప్పడం మాని, పంచతంత్ర కథలన్నీ వింటే ఆయనకు నీతి అన్నది బోధపడుతుంది. జగన్మోహన్ రెడ్డి పంచతంత్ర కథల గురించి చెబుతుంటే, ఆయనకు ఆయన నవ్వుకోవడం మినహా, ప్రజలెవరు పట్టించుకోలేదన్నారు.
అవినాష్ రెడ్డిని పిలవడం గ్యారెంటీ
జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి ని సిబిఐ ఎప్పుడు పిలుస్తారో తెలియడం లేదు. 25 ఎంపీ స్థానాలకు గాను 24 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఒక దినపత్రికలో రాయించుకున్న జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్షాలన్నీ కలిస్తే నొప్పి ఏమిటి? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయం. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు రద్దు చేయడంతో, అరెస్టు ఖాయమని భావించాం. సిబిఐ అరెస్టుకు ఇప్పుడు ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. అయినా సిబిఐ, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఆసక్తిని ప్రదర్శించడం లేదు అంటే,ఏదో మతలబు ఉందన్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A 1 నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేయాలని, సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ తో పాటు, డాక్టర్ వైఎస్ సునీత తరపు న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. వైయస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ తో పాటు, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై రేపు కీలకతీర్పులు వెలువడే అవకాశం ఉందని రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు.
ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలను టీడీపీ, జనసైనికులు తిప్పి కొట్టాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వేసే ఎత్తుగడలను టిడిపి, జన సైనికులు తిప్పి కొట్టాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ప్రశాంత్ కిషోర్ తన టీం సభ్యులతో టిడిపిని, జనసేన ను ట్రోల్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయిస్తారని, దాన్ని టిడిపి, జనసేన పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు తీసుకునే నిర్ణయాలకు, రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు కట్టుబడి ఉండాలి. రాష్ట్ర బిజెపి నాయకత్వం ఎలా ఉన్నప్పటికీ, కేంద్రంలో బిజెపి నాయకత్వం పటిష్టంగా ఉంది. పసుపు, ఎరుపు రంగులు కలిస్తే కాషాయ రంగు ఏర్పడుతుంది. ఒంటికి ఇంటికి వేస్తున్న ఆ మూడు రంగులను తుడిపేసి, కాషాయ రంగును వేయిద్దాం. కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఉండాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి బస్మీ పటలం చేశారు. గత నాలుగు ఏళ్లలో ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి, బటన్ నొక్కుడు ద్వారా ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయంలో టి డ్కో ఇల్లు 90 శాతం పూర్తి కాగా అదనంగా ఒక్క స్లాబు కూడా వేయని జగన్మోహన్ రెడ్డి, జగనన్న గృహాలు అని, హ్యాపీ హోమ్స్ అంటూ రంగులు వేసి బిల్డప్పులు ఇస్తున్నారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.