Suryaa.co.in

Features

పాపం “మగాడు”!

అనాదిగా అన్నింటా వెనుకబాటు తనమే మగాడిది..!

“తరగతి గదిలో సీట్ల కేటాయింపు నుండి ఆర్టీసి బస్సులోనీ సీట్స్ వరకు వెనుక వరుస క్రమమే ….

అంతేనా….

“నలభీమ పాకం”…, “బాధ వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే.,,, నువ్వేమి మగాడివిరా” అని దెప్పిపొడవడం… వంటి పదాలు “ పెళ్ళి తరువాత మగ వాని దుస్థితి “ మన ముందు సాక్షాత్కరింపచేసే ఆణిముత్యాలు..

అందుకే పాపం మగాడు…!

పట్టు చీరలు, బంగారు అభరణాలు, అలంకార వస్తువులను
ప్రమోట్ చేసేందుకు మాత్రం మహిళ ఛాయ చిత్రాలు…,
….కాని వాటి కోనుగోలుకు ఉపయోగించే
డెబిట్, క్రెడిట్ కార్డుల ప్రమోట్ కు మాత్రం పురుషుల చిత్రాలు…!
సొమ్ము ఒకడిది..సోకు మరొకరిది అంటే ఇదేనేమో…

అందుకే పాపం మగాడు….!

“అమ్మోర్ల” సినిమాలు వచ్చాయంటే చాలు…
చీరలు, కుంకుమ భరిణె లను ఆడ వారికి పంచేస్తుంటారు థియేటర్ వాళ్ళు…!
అంతే కాదు
ఎలక్షన్లో సైతం నువ్వు మా ఆడ పడుచువు అంటూ మొహానికి కుంకుమలు పూసేస్తూ, చేతిలో కొత్త చీరల సంచులను కుక్కేస్తూ వుంటారు పోటీ చేసేవాళ్ళు…!
కానీ… మగాడు కి ఓ చిన్నపాటి దో వతి.. బుల్లి కర్చీఫ్ ను ఇచ్చిన దాఖలాలు మచ్చుకైనా కనపడవు…!

అందుకే పాపం మగాడు..!!

నదులు వరద నీటితో స్నాన ఘట్టాలను తాకినప్పుడు “కొత్త గంగమ్మ తల్లి” వస్తోంది అంటూ తన్మయత్వం పూజలను చేస్తూ పసుపు, కుంకుమను అర్పిస్తూ ఉంటారు మహిళలు…

కాని అవే నదులను తనలో సంగమింపచేసుకున్న పాపానికి వాటి మధ్య పొగసక కలిగించే అలజడుల కారణంగా సముద్రుడు తన కెరటాలను కాస్త ఒడ్డుకు జారవిడిస్తే.. కొత్త సముద్రుడు వచ్చాడంటూ కనీసం ప్రణమిల్లరు….
సముద్రుడు మగవాడిగా కీర్తింపబడుతుండటమే ఈ వివక్షకు కారణం…. అందుకే పాపం మగాడు…!

పెళ్ళిళ్ళలో, శుభకార్యాల్లో తెలియని వారికి పరిచయం చేసేటప్పుడు ఆడవాళ్ళనైతే.. “ఆవిడ కోడలనో… , ఈవిడ కోడలనో, మరోకామె కూతురనో పరిచయం చేయ్యడం……

అదే మగవారినైతే “దాని మొగుడే”…”దీని మామగారే”..అంటూ మూతి సాగదీస్తూ చెప్పడం…ఈ విధంగా పరిచయాల సమయంలో సైతం మగాడికి ఓ గుర్తింపు లేకుండా పోతోంది… అందుకే పాపం మగాడు….!
పైగా ఇదొకటి….

“లేచింది నిద్రలేచింది…మహిళా లోకం…. దద్ధరిల్లింది పురుష ప్రపంచం”…అంటూ పొగిడిస్తూ… మగవానిచేతే ఆ పాటను పాడించడం, అభినయం చేయంచడం”……

మొత్తం మీద మగవాడిది భావ ప్రకటనను తెలుపుకోలేని దిక్కుమాలిన జీవితం… అందుకే “పాపం మగాడు”….!
ఆఖరికి ఆ త్రిమూర్తులకు సైతం తప్పలేదు….
“సర్వాధికారాలుఉన్నా… శ్రీమన్నారాయణుని హృదయంలో తిష్టవేసిన లక్ష్మీ దేవిదే పెత్తనం అంతా…!

….. అదే విధంగా శివుడికి అయితే పార్వతి సగభాగం అయిపోయింది…పైగా తలమీదే తిష్టవేసిన గంగమ్మతల్లి మరొపక్క… వారీద్దరూ ఎటు నడవమంటే అటే శివయ్య దారి…!

ఇంక చతుర్మఖ బ్రహ్మకు… సరస్వతి దేవి స్వయంగా బ్రహ్మయ్య నాలిక మీదనే ఉండి మాట్లాడిస్తుంది…తన మాటే చెల్లేటట్టుగా….!
ఈ విధంగా దేవుళ్ళకు సైతం ఈ తిప్పలు తప్పనప్పుడు…మానవమాత్రులైన మనమెంత అని “సరిపుచ్చుకోవడమే” నేటి కలియుగాన మగవానికి ఉండాల్సిన ఉత్తమ లక్షణం!……

అందుకే పాపం మగాడు…!

(నవ్వుకోవడానికి మాత్రమే అని పాఠకులు గమనించగలరు)

– .. శ్రీపాద శ్రీనివాస్

 

LEAVE A RESPONSE