కార్మికుల సమస్యలు పరిష్కారంలో ఎందుకు తాత్సారం
కేంద్రం తెచ్చిన గనుల ప్రైవేటీకరణ బిల్లుకు ఎంపీగా కవిత మద్దతు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలంతా ఒక్కటై పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా దోచుకు తిన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి దివాళా తీసే పరిస్థితి నెలకొందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అటు ప్రభుత్వంలో ఇటు కార్మిక సంఘాల్లో ఉండే కేసీఆర్ కుటుంబం కార్మికుల సమస్యలను మాత్రం గాలికొదిలేసిందన్నారు. తెలంగాణలో 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా గురువారం పార్టీ నేతలు మధుయాస్కీ, పొంగులేటి, శ్రీధర్ బాబు, ఇతర నాయకులతో కలిసి భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌లో సింగరేణి కార్మికులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
తెలంగాణ గాంధీనని చెప్పుకుంటున్న మనిషి, పార్లమెంటులో వీరోచితంగా పోరాడతానంటూ మహబూబ్‌నగర్ ప్రజల్ని మోసం చేసి నిద్రపోతున్నపుడు నడుం బిగించింది సింగరేణి కార్మికులని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమైనపుడు జానారెడ్డి ఇంట్లో తెలంగాణ సాధనకు అవసరమైన కార్యాచరణ కోసం కేసీఆర్ శరణు కోరితే.. కోదండరాం అధ్యక్షతన జేఏసీ ఏర్పడిందని గుర్తు చేశారు.
జేఏసీ ఏర్పాటుతో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు, సీపీఐ నుంచి బీజేపీ వరకు అన్ని వర్గాల ప్రజలు ఏకమై తెలంగాణ నినాదాన్ని కేంద్రానికి వినిపించారన్నారు. సకల జనుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి ఆపేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నిలిచిన సింగరేణి త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొనకుండా, బొగ్గు ఉత్పత్తి ఆపకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని కళ్లారా చూడలేకపోయే వారమన్నారు రేవంత్ రెడ్డి.
కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికులు గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదని, హక్కులు మాత్రమే అడుగుతున్నారని, అసాధ్యమైనవి ఏమీ అడగడం లేదని, సింగరేణి నష్టాలకు జెన్‌కో చెల్లింపులు చేయకపోవడమే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సింగరేణి సీఎండీగా ఒకే ఒక్క అధికారిని ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తూ నష్టాలకు కారణం అయ్యారన్నారని రేవంత్ రెడ్డి. మోదీ గనులను ప్రైవేటీకరించినపుడు కవిత ఎంపీగా ఆ బిల్లును మద్దతిచ్చారన్నారు. అరబిందో ఫార్మా కంపెనీలకు బొగ్గు కేటాయింపులు ఇచ్చారని, తాడిచర్లలో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు.
ఒడిశాలో నైనీ కోల్‌మైన్‌ను ప్రతిమా శ్రీనివాస్‌కు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. ఒడిశాలోని తెలంగాణ ప్రభుత్వ కోల్ మైన్స్‌ను తాము పోరాటాలతో కాపాడుకున్నామన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇన్నేళ్లకు భవిష్యత్తును మార్చుకునే అవకాశం కార్మికులకు వచ్చిందని చెప్పారు. మాయమాటలు నమ్మితే పదేళ్ల కష్టాలు అలాగే ఉండిపోతారని హెచ్చరించారు.
తెలంగాణలో 16 అసెంబ్లీలలో సింగరేణి కార్మికులు గెలుపు ఓటముల్ని నిర్దేశిస్తారని, కార్మికులు ఒక్కతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సింగరేణి కష్టాలను తొలగిస్తామన్నారు రేవంత్ రెడ్డి. శ్రీధర్ బాబు, గండ్ర సత్యనారాయణ రావులను గెలిపించాలన్నారు. 2009, 2014, 2018లో సత్యనారాయణకు అన్యాయం జరిగిందని, 20 ఏళ్లలో ఎప్పుడూ సింగరేణిని వదులుకోలేదని, ఓడినా తెల్లార్లు సింగరేణి కోసమే పని చేశారన్నారు. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
ఈ విషయంపై నవంబర్ 30న ప్రతి ఒక్క కార్మికుడు, 50వేల కుటుంబాలు చర్చించుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికుల బలాన్ని ప్రదర్శించాలన్నారు. బలప్రదర్శన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను గుల్ల చేసిన పందికొక్కుల్ని బోనులో బంధించాల్సిన సమయం వచ్చిందన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, శ్రీధర్‌బాబు సారథ్యంలో కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ బస్సుయాత్రను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీటర్ వేదికగా కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ‘నిస్సిగ్గు మాటలు.. ఎదురుదాడులు.. కేరాఫ్ అడ్రస్ డ్రామారావు, పదేళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ – కేడీ, కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ – కేడీ. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ – కేడీ, విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావు’ అని పేర్కొన్నారు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ట్వీట్ యథాతధంగా…
నిస్సిగ్గు మాటలు
ఎదురుదాడులు
కేరాఫ్ అడ్రస్ డ్రామారావు
10 ఏళ్లు అధికారంలో ఉండి
అంట కాగింది మోడీ – కేడీ
కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ – కేడీ.
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ – కేడీ
తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదు
భూపాలపల్లి విజయభేరి యాత్ర క్యాంపు వద్ద గురువారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారి సమక్షంలో సర్పంచుల సంఘం నారాయణ పేట జిల్లా అధ్యక్షుడు వీరా రెడ్డి, సర్పంచ్ భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు సుబ్బాన్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, గోపాల్ నాయక్, మద్దూరు టౌన్ బీఆరెస్ అధ్యక్షుడు చెన్నా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా మంథని నియోజకవర్గానికి చెందిన నాయకులు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2004 మాదిరిగా కాంగ్రెస్ తుఫాన్ వచ్చినట్లు మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తుఫాను రాబోతోంది ఆ తుఫానులో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మనకు మంచిరోజులు రాబోతున్నాయి. డిసెంబర్ 9, ఉదయం 10.30కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.