– అసెంబ్లీకి కేసీఆర్
– బడ్జెట్ సమావేశాలకు రానున్న కేసీఆర్
– ఇప్పటివరకూ హాజరుకాని మాజీ సీఎం
– అనారోగ్యం పేరుతో ఇప్పటిదాకా గైర్హాజరు
– అసెంబ్లీకి డుమ్మాపై కాంగ్రెస్-బీజేపీ విసుర్లు
– కాలు బాగోలేకపోతే నల్లగొండ సభకు ఎలా వెళ్లారంటూ ప్రశ్నల వర్షం
– ఎట్టకేలకూ అసెంబ్లీ సమావేశాలకు సారు
– అస్త్రశస్త్రాలతో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ సిద్ధం
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ జాతిపిత, మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీకి వస్తున్నారు. పక్కటెముకకు ఆపరేషన్ జరగడంతో.. ఇప్పటివరకూ శాసనసభ సమావేశాలకు హాజరుకాని కేసీఆర్ తీరుపై, కాంగ్రెస్-బీజేపీ దుమ్మెత్తిపోశాయి. రేవంత్‌ను సీఎం స్థానంలో చూడటం ఇష్టం లేకనే, కేసీఆర్ సభకు డుమ్మా కొడుతున్నారన్న ప్రచారం ఉంది.
దానితోపాటు ఆయన వస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఎలా దెబ్బతిన్నాయో వివరించేందుకు, సీఎం రేవంత్‌రెడ్డి సభలోనే స్క్రీన్లు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కూడా, కేసీఆర్ సభకు హాజరుకాకపోవడానికి ఒక కారణమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. ఆరోగ్యం బాగోలేదన్న కేసీఆర్ తన ఇంటి నుంచి 5 కిలోమీటర్ల దూరం లేని అసెంబ్లీకి రాకుండా, నల్లగొండ సభకు ఎలా వెళ్లారని కాంగ్రెస్-బీజేపీ అప్పుడే విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించడం ఆసక్తిరేపుతోంది. సభలో రేవంత్-కేసీఆర్ వాగ్వాద-సంవాదాలు ఏస్థాయిలో ఉంటాయన్న ఉత్కంఠే, ఆ ఆసక్తికి కారణంగా కనిపిస్తోంది. గతంలో రేవంత్ సభలో ఉన్నప్పుడు ఇరువురి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌దే పైచేయిగా కనిపించింది. అప్పటికి బీఆర్‌ఎస్ శాసన సభ్యులు ఏకతాటిపైనే ఉన్నారు. తాజాగా కేసీఆర్ హాజరయ్యే సభకు ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం దారుణంగా పడిపోయింది. ఈ సమావేశాలు ముగిసేలోగా.. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులేస్తోంది. ఆమేరకు ఆపరేషన్ ఆకర్ష్ శరవేగంగా జరుగుతోంది.
కాగా నిరుద్యోగ సమస్య, రైతురుణమాఫీకి షరతులు, రైతుభరోసా, బకాయి వంటి సమస్యలపై కేసీఆర్.. కాంగ్రెస్ సర్కారును నిలదీయనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ హామీలపైనే కేసీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు- నాసిరకం పనులతోపాటు, టెలిఫోన్‌ట్యాపింగ్, డ్రగ్స్ అంశాలతో కేసీఆర్‌పై అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
అసెంబ్లీ లో బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలు ఇవే..
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు -జాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్ధుల పై ప్రభుత్వ దమనకాండ
రాష్ట్రం లో శాంతి భద్రతల నిర్వహణ లో వైఫల్యం
రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ..ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి
ఆరు గ్యారంటీల అమలు ..శాసన సభలో చట్టబద్దత
రైతు రుణ మాఫీ అమల్లో ఆంక్షలు -నష్టపోతున్న రైతాంగం
పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపు పై ప్రభుత్వ వైఫల్యం -రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు
గ్రామాలు ,పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం -పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటు పడుతున్న ప్రజారోగ్యం
ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిల విడుదల లో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు .
పైన పేర్కొన్న అంశాలతో పాటు బీ ఆర్ ఎస్ ఎల్పీ సమావేశం లో సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుని మరి కొన్నిటిని ప్రస్తావించే అవకాశం ఉంది.