– ముఖ్యమంత్రి కి సంఘం కృతజ్ఞతలు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘ టీయూడబ్ల్యూజే భవన్’ నిర్మించడానికి, ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కి మీడియా అకాడమీ చైర్మన్, టి యు డబ్ జే అధ్యక్షుడు, అల్లం నారాయణ ధన్యవాదాలు తెలిపారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుగా ఏర్పడి న నాటినుంచి నేటి వరకు టీయూడబ్ల్యూజే చేసిన కృషి తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జర్నలిస్టుల పట్ల ఉన్న సానుకూల వైఖరి, ఔదార్యం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, పురపాలక ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ కు అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు,నగరం నడిబొడ్డున ఉప్పల్ భగాయత్ లో తమకు ఒక గూడు సాధించుకున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. త్వరలోనే భవన నిర్మాణానికి అందరి సహకారంతో చర్యలు చేపడతామని అన్నారు.
గత ఐదు సంవత్సరాలుగా యూనియన్ నాయకులు, జర్నలిస్టు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృషి, యూనియన్ ఉపాధ్యక్షులు రమేష్ హజారే చూపిన చొరవ వల్ల, ఇది సాధ్యమైందని అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కు అనుబంధంగా ఉన్న జర్నలిస్టు సంఘాలకు, జర్నలిస్టు కార్యక్రమాలకు తెలంగాణ జర్నలిస్టు భవన్ కేంద్రంగా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ పిఆర్ఓ యూనియన్ ఉపాధ్యక్షులు రమేశ్ హజారి, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, , యోగానంద్, తెంజూ అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, కార్యదర్శి రమణ, భాస్కర్, నాగరాజు, హరీష్ నండూరి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం:
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదర్శనగర్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో, నేడు పునర్నిర్మాణంలో తెలంగాణ జర్నలిస్టులుగా తమ వంతు పాత్ర పోషిస్తున్న తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘ భవనానికి స్థలం కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్ట్ సంఘ నాయకులు సంబరాలు చేసుకొని పాలాభిషేకాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.