లిఖిత పూర్వక పరీక్షకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
పారదర్శకతతో సమర్ధత కలిగిన అభ్యర్ధులతో భర్తీ చేయాలి
డీఎస్సీ, గ్రూపు 2 నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఉద్యమానికి సిద్ధంగా నిరుద్యోగులు
– ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవిరావు
ఎపి ప్రభుత్వం విశ్వ విద్యాలయాల్లో అసిస్టంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా కాకుండా న్యాయ వివాదాలు తలెత్తకుండా, పక్కా ప్రణాళికతో సత్వరం పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా. వేపాడ చిరంజీవి రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఏటా జనవరి ఒకటో తారీఖునే జాబ్ కాలెండర్ ఇస్తామని అని ఊదరగొట్టి నాలుగన్నరేళ్ళ పాలనా కాలంలో ఒక్క సరైన నోటిఫికేషన్ యివ్వ కుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం హడావిడి పడుతుండడం వలన నిరుద్యోగులకు విశ్వాసం కలగడం లేదని అన్నారు.
ఇటీవల తమ ముగ్గురు ఎమ్మెల్సీల బృందం గవర్నర్ ఎస్.అబ్దుల్ నాజర్ ను కలుసుకుని రాష్ట్రంలో నెలకొన్న ఉద్యోగ,నిరుద్యోగ సమస్యలను విన్నవించిన సంగతిని గుర్తు చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 70 శాతం వరకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని అన్నారు. ఇంకా ఈ పోస్టులను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయకపోవడం మూలంగా విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.
ఈ పరిస్థితుల్లో డిగ్రీ, పిజీ చదువుల కోసం తమ పిల్లలని ఆంధ్ర ప్రదేశ్ లో కాకుండా వ్యయ, ప్రయాసలకు ఓర్చి చెన్నై, కలకత్తా, డిల్లీ యూనివర్సిటీలో చదివించుకునే దుస్థితి తలెత్తిందని అన్నారు. ఈ విషయంలో మన రాష్ట్రల ప్రజలు చేసుకున్న కర్మ ఏమిటని ప్రశించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ఉన్నత చదువులు ఆక్స్ ఫర్డ్, క్రేంబ్రిడ్జి స్థాయిలో ప్రమాణాలకు తీసుకెళ్తామని, ఇంటికో సత్య నాదెళ్ళను తయారు చేస్తామని నాలుగేళ్ళుగా నియమాకాలపై శ్రద్ధ చూపలేదన్నారు.
ఇప్పుడు తమ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి మూలంగా నియామకాల ప్రకటన ఇస్తున్నట్టుగా వుందని అన్నారు. చాలా విషయాల్లో ప్రభుత్వం అనాలోచితంగా ముందుకు వెళ్ళడం మూలంగా కోర్టులు మొట్టికాయలు వేసి స్టే లు ఇవ్వడం మూలంగా ప్రజా ధనంతో పాటు విలువైన సమయం వృధా అవుతున్నదని అన్నారు. ఈ పరిస్థితుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో సాంకేతిక అవాంతరాలు తలెత్తకుండా సత్వరమే నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా, సామర్ధ్యం గల అర్హులతో నియామకాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పెరుగుతాయనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.
రాష్ట్రంలో లక్షలాది ఖాళీలున్నటువంటి డిఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్, గూప్ 2, గూప్-4, జూనియర్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, గురుకులాల్లో బోధనా సిబ్బంది, ఎ.ఇ, ఎ.ఇ.ఇ. పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ల ఊసే ఎత్తకపోవడం విచారకరం అన్నారు. పట్టణప్రాంతాల్లో కోచింగ్లు తీసుకుంటూ కఠోర సాధన చేస్తున్న లక్షలాది మంది గ్రామీణ నిరుద్యోగ యువత నోటిఫికేషన్లు లేక పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు.
లక్షలాది రూపాయిల అప్పులు చేసి నోటిఫికేషన్స్ లేక మనోవ్యధతో ఒకరిద్దరు నిరుద్యోగులు బలవన్మరణాలు పాల్పడటం శోచనీయమని అన్నారు. ఉత్సాహం ఉప్పొంగే నిజాయితీ యువత ప్రభుత్వ కొలువులు సాధిస్తే పాలనారంగంలో పెనుమార్పులు చుట్టవచ్చని అన్నారు. అటువంటి యువత అవకాశాలను దెబ్బతీసి, అడగకపోయినా ఉద్యోగ విరమణ వయసు పెంచడం ప్రభుత్వపు దివాలాకోరుతనానికి ప్రబల నిదర్శనంగా చెప్పారు.
యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఖాళీలను పక్కా ప్రణాళికతో, ఎటువంటి న్యాయవివాదాలకు తావులేకుండా అర్హులైన అభ్యర్ధులతో 90 రోజుల్లో భర్తీ చేయాలని అన్నారు. నియామక ప్రక్రియలో లిఖిత పూర్వక పరీక్షకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పారదర్శకతతో సమర్ధత వున్న అర్హులైన అభ్యర్ధులతో భర్తీ చేయాలన్నారు.
డిఎస్సీ, గ్రూపు 2 పోస్టులకు నోటిఫికేషన్ వెంటనే ఇవ్వకపోతే, వాటి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధంగా వున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరిగి వ్యవహరించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా. చిరంజీవి రావు చెప్పారు.