డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
17 మందికి నియామక పత్రాలు అందజేత
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఇంగ్లీష్ మాధ్యమ పాఠ్యాంశాలను అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు నేర్పించాలని తద్వారా పేదవాడి పిల్లలకి కూడా ఇంగ్లీషు చదువు చిన్న వయసు నుంచే అలవాటు అవుతుందనీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అంగన్వాడీలకు ఇకపై స్మార్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. నరసన్నపేట నియోజక వర్గ పరిధిలో నాలుగు మండలాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలిపి నూతనంగా ఎంపికైన 17 మందికి మబుగాం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నపిల్లల పాఠ్యప్రణాళిక పటిష్టంగా ఉండాలని చెప్పారు.
నాడు – నేడు కింద బాగు చేస్తున్న భవనాల నిర్వహణపై అంగన్వాడీలు దృష్టిపెట్టాలనీ అన్నారు. ఏం సమయానికి ఏం చేయాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఖచ్చితమైన మెనూ, సమయపాలన ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు అని చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కలుపుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. నియామక పత్రాలు అందుకున్న వారంతా డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, నరసన్నపేట, జలుమూరు, పోలాకి ఎంపీపీలు ఆరంగి మురళి, వాన గోపి, ముద్దాడ దమయంతి నాయుడు, సుడా చైర్పర్సన్ ప్రతినిధి కె సి హెచ్ బి గుప్తా, పొందర కార్పొరేషన్ ప్రతినిధి రాజపు అప్పన్న, దాలి నాయుడు, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.