– వారం రోజుల పాటు పంపిణీ
– రాష్ట్ర ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి: వచ్చే నెల 25 నుండి 31వ తేదీ వరకూ వారం రోజుల పాటు స్మార్టు రేషన్ కార్డులను పంపిణీ చేయున్నామని రాష్ట్ర ఆహార అండ్ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంగళవారం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ స్మార్టు రేషన్ కార్డులను రాష్ట్రంలోని 1,45,97,486 మందికి ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోను స్థానికి శాసన సభ్యుడు, జిల్లా స్థాయిలో మంత్రులు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు నిర్వహించి ఈ స్మార్టు కార్డులను పంపిణీ చేయనున్నామన్నారు.
దేశంలోనే ప్రప్రథమంగా 96.05 శాతం మేర రేషన్ కార్డుల కేవైసీని పూర్తి చేసి దేశంలోనే రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచినట్టు ఆయన తెలిపారు. అయిదేళ్ళలోపు, 80 ఏళ్ళు పైబడిన మొత్తం 11,47,132 మంది కేవైసీ చేయాల్సిన పనిలేదన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు రాష్ట్ర వ్యాప్తంగా 16,08,612 దరఖాస్తులు రాగా వాటిలో 15,32,758 దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించామని తెలిపారు. కేవలం 4.72 శాతం దరఖాస్తులను మాత్రమే తిరస్కరించామని చెప్పారు.
ఈ ప్రక్రియ ద్వారా నూతనంగా 9,87,644 మంది తమ పేర్లను నమోదు చేశామని, వీరితో కలుపుకుని లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897 కు చేరుకున్నట్టు తెలిపారు. వీరిలో 2,68,23,200 మందికి కేంద్ర ప్రభుత్వం, 1,61,56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. తద్వారా రాష్ట్రంలో రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 కు చేరుకున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్డుల విదానాన్ని డిజిటలైజ్ చేసి స్మార్టు కార్డులు జారీచేసేందుకు ప్రభుత్వం ఎంతో కసరత్తు చేస్తోందన్నారు. భద్రత, జవాబుదారితనం, పారదర్శకతతో కూడిన విధంగా డెబిట్, క్రెడిట్ కార్డు తరహాలో ఈ స్మార్టు కార్డులను రూపొందించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు స్మార్టుకార్డులపై రాజకీయ నాయుకుల ఫొటోలు ఏ మాత్రం లేకుండా కుంటుంబ పెద్ద ఫొటోతో పాటు సభ్యులు పేర్లు అన్ని ఆ కార్డులో పొందుపరిచామన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టరుతోని అనుసంధానం చేశామని, తద్వారా ట్రాన్జాక్షన్ జరుగగానే సెంట్రల్ ఆఫీసులో నమోదు అయ్యే విధంగా ఈ కార్డును రూపొందించామని మంత్రి తెలిపారు.
ఈ క్యూఆర్ కోడ్ స్మార్టు కార్డులు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానున్న 26,796 రేషన్ షాపుల్లో ప్రతి నెలా 1 నుండి 15 వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు రేషన్ సరుకులు పంపణీ ఉంటుందన్నారు.
ఇక, రెండో విడత కింద ఇంకా సిలిండర్లు పొందనివారంతా ఈ నెలాఖరులోపు పొందాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రాయితీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేసే ప్రక్రియను ప్రారంభించేందుకై ఎన్.టి.ఆర్., కృష్ణా జిల్లాల్లో పైలెట్ ప్రాజక్టును అమలు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.