– ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
– ‘కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాలేజ్ ఫీ రెన్యూవల్స్ ప్రోగ్రామ్ ఫర్ ది అకడమిక్ ఇయర్ 2025-26 & ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమానికి హాజరయిన ప్రజాప్రతినిధులు
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ‘మానవ సేవే – మాధవ సేవ’ అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం బాచుపల్లిలో ‘కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాలేజ్ ఫీ రెన్యూవల్స్ ప్రోగ్రామ్ ఫర్ ది అకడమిక్ ఇయర్ 2025-26 & ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘జనాభాకు అనుగుణంగా ప్రజల అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కృషి చేస్తే సరిపోదు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే సామాజిక బాధ్యతతో కూడిన ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ముఖ్యంగా కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
‘సమాజం మనకేమిచ్చిందన్నది కాదు, మనమేమిచ్చామన్నది ముఖ్యం. అన్నదానంతో పాటు విద్యాదానం చాలా ముఖ్యం. విద్య అనేది కేవలం ఒక డిగ్రీ కాదు, అది ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చే శక్తి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తుండటం నిజంగా ప్రశంసనీయం. అందరికీ ఆదర్శనీయం’ అని కొనియాడారు.
‘సామాజిక సేవ అంటే కేవలం డబ్బులు ఖర్చు చేయడం మాత్రమే కాదు. ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం కూడా సేవే. ఇప్పుడు మనం చేసే మంచి పనులు మనతోనే ఆగిపోవు. అవి మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి’ అని వివరించారు.
‘మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకోండి. అందుకు అనుగుణంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి… గొప్ప విజయాలు అంత సులభంగా రావు. ఓపిక, పట్టుదల, నిరంతర కృషి అవసరం. ఎన్ని అడ్డంకులొచ్చినా లక్ష్య సాధనలో ధైర్యంగా ముందుకు సాగండి. తప్పకుండా విజయం సాధిస్తారు’ అని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, ప్రణీత్ గ్రూప్ సీఎండీ నరేంద్ర కుమార్ కామరాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.