– దశల వారీగా ఎంఎంఈ లు పెండింగ్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా ఎంఎంఈ లు పాలసీ లేదు. మొదటిసారి ఓ చరిత్ర. ఎంఎంఈ ల సమగ్ర అభివృద్ధికి కొత్త పాలసీ లో అన్ని అంశాలను పొందుపరిచారు.పాలసీ అద్భుతంగా ఉంది. రాష్ట్ర , ఎంఎంఈ ల అభివృద్ధికి కొత్త పాలసీ దోహదపడుతుంది. ఎంఎంఈ లను అభివృద్ధి చేయాలని మా నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ సమావేశంలో దిశ నిర్దేశం చేశారు. సీఎం కొత్త పాలసీ తెచ్చారు. ఎంఎంఈ కంపెనీ ల్లో టేక్ ఓవర్ ప్రమాదం లేదు.
రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణల కోసం మంత్రి శ్రీధర్ బాబు నిత్యం శ్రమిస్తున్నారు. గత ప్రభుత్వాలు అట్టహాసంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సబ్సిడీ ప్రకటించి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.. రాబోయే రోజుల్లో వారిని ప్రోత్సహించేందుకు పెండింగ్ లో ఉన్న సుమారు 2000 కోట్ల నిధులను దశలవారీగా మా ప్రభుత్వం విడుదల చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
శిల్పకళా వేదికలో ఏర్పాటుచేసిన ఎంఎంఈ నూతన పాలసీ ఆవిష్కరణ సభలో ప్రసంగించారు. కొత్త పాలసీలో సామాజిక న్యాయం కనిపిస్తుంది అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. కొత్త పాలసీ అద్భుతంగా ఉంది, ఇది రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని చిన్న మధ్యతరహా పరిశ్రమలపై ఆధారపడిన వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నారు. తెలుగు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఒక ప్రత్యేక పాలసీ లేదు.
కేవలం పారిశ్రామిక పాలసీ మాత్రమే ఉండేది, కానీ మా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఒక కొత్త పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్ర, దేశ జిడిపి పెరుగుదలకు చిన్న మధ్య తరహా పరిశ్రమలు దోహదపడతాయి, వీటిని ప్రోత్సహిస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను గురించి మా నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాదులోని తాజ్ డెక్కన్ లో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించి దేశ ఆర్థిక సమగ్ర అభివృద్ధికి ఈ పరిశ్రమలు దోహదపడతాయని అవగాహన కల్పించారని వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ఇగో ఇది మా విధానం అని స్పష్టంగా ప్రకటించడం అభినందనీయమన్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది అనడానికి ప్రత్యేక పాలసీని తీసుకురావడమే అందుకు నిదర్శనం అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనలో 45 నుంచి 50 వేల కోట్ల మేర ఎంఓఏలు కుదుర్చుకున్నారు, ఇటీవల అమెరికా కొరియా దేశాల్లో పర్యటించి 36 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారు.. అన్ని సదుపాయాలు కల్పిస్తామని మల్టీ నేషనల్ కంపెనీలను ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో చిన్నా మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి ఏంటి అని నేను ఆలోచిస్తున్న సమయంలో చిన్న తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టి భూ సదుపాయం, మహిళలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కోటా, డబ్బు రాయితీని 75 లక్షల నుంచి ఒక కోటి రూపాయలకు పెంచారు.. చిన్న మధ్యతరహా పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అనడానికి ఇవే ఉదాహరణలు అన్నారు.
రాష్ట్రంలో భారీ చిన్న పరిశ్రమలు మేలు కలయికగా ముందుకు వెళ్లి ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు.
చిన్న మధ్య పరిశ్రమలు హైదరాబాద్ రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం అన్నారు. బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, డి ఆర్ డి ఓ, ఐడిపిఎల్ వంటి భారీ పరిశ్రమలు హైదరాబాదులో నెలకొల్పాగా వాటికి అనుసంధానంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆవిర్భవించాయని తెలిపారు.
చాలా రాష్ట్రాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూతపడుతున్నాయి. గుజరాత్లో 1626, మహారాష్ట్రలో 5082, తమిళనాడులో 2486 పరిశ్రమలు మూతపడ్డాయి. అదే తెలంగాణలో చూస్తే 231 పరిశ్రమలు మాత్రమే మూతపడ్డాయి. స్థానికంగా వాతావరణం, అవకాశాలు, మానవ వనరులు పుష్కలంగా ఉండడంతోనే తెలంగాణలో తక్కువ సంఖ్యలో చిన్న ,మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని వివరించారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో పెద్ద కంపెనీలల్లో ఒక కంపెనీ మరో కంపెనీని టేక్ ఓవర్ చేస్తాయి, అదే చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో టేక్ ఓవర్ ఆందోళన అవసరం లేదు అన్నారు.
రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని, టాటా కంపెనీ సహకారంతో ఐటిఐ లను ఆధునికరించిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఇంజనీరింగ్ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక కొత్త విధానాన్ని పరిచయం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నిత్యం శ్రమిస్తున్నారని అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సదస్సును ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారని తెలిపారు. తాజాగా కొత్త పాలసీని ఆవిష్కరించారని వివరించారు.