Suryaa.co.in

Telangana

వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి

– రెండు మెగావాట్ల వరకు ఉత్పత్తికి అనుమతులు.. ఉత్పత్తి అయిన విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్-A పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి వారికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ పథకం కింద 0.5 మెగావాట్ల నుండి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన లేదా పాడుబడిన వ్యవసాయ భూములపై ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ విధంగా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిని చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

రైతులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం డెవలపర్లకు లీజుకు ఇచ్చుకోవచ్చు, ఈ సందర్భంలో భూమి యజమానికి డెవలపర్లకు మధ్య డిస్కమ్ ల ద్వారా ఒప్పంద మేరకు లీజు మొత్తం అందించబడుతుందని తెలిపారు.

రైతులు, రైతు బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్లు ), వాటర్ యూజర్ అసోసియేషన్లు (wua) సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేయవచ్చు అని తెలిపారు.
ఈ పథకం కోసం దరఖాస్తులు TGREDCO ద్వారా ఆన్ లైన్ లో సమర్పించాలని, లిస్టులో పేర్కొన్న సమీప సబ్ స్టేషన్ ను ఎంపిక చేసుకొని అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.

డిస్కం ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును రూ. 3.13/కిలో వాట్ గంట(KWH) ధర వద్ద 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తుందని తెలిపారు.

LEAVE A RESPONSE