Suryaa.co.in

Andhra Pradesh

రైతుల్ని నిండా ముంచేసింది ఈ ప్రభుత్వం… మళ్లీ రైతు దినోత్సవాలా?

-వైసీపీ సర్కారుపై సోమిరెడ్డి విమర్శలు

రాష్ట్రంలోని రైతులను నిండా ముంచేసింది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ రైతు దినోత్సవాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“రైతులందరూ బాగుండాలనే మేం కోరుకుంటాం. రైతు దినోత్సవం జరిపే అర్హత వైసీపీకి లేదు. ఈ మూడేళ్లలో రైతులు కుప్పకూలిపోయారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఆపేయడం ఎంత అన్యాయం? సూక్ష్మ నీటి పారుదల రంగానికి టీడీపీ హయాంలో ఏటా రూ.1200 కోట్లు ఖర్చు చేశాం. ఈ మూడేళ్లలో మీరెంత ఖర్చు చేశారు? అసలు, పథకాన్నే ఆపేశారు.

భూసార పరీక్షలు చేసి, సూక్ష్మపోషకాలైన జింకు, జిప్సం, బోరాన్ ఉచితంగా అందించే పథకం అమలు చేశాం. దీన్ని కూడా ఆపేశారు. కేంద్ర-రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి యాంత్రీకరణ పథకాన్ని కూడా ఆపేశారు. ఈ పథకానికి ఏడాదికి రూ.400 కోట్లు ఖర్చు చేశాం. రైతు రథం కింద రెండేళ్లలో 23 వేల ట్రాక్టర్లు ఇచ్చాం. దీన్ని కూడా నిలిపేశారు. మీకసలు రైతు దినోత్సవం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నిస్తున్నా.

9 గంటల కరెంటును 12 గంటలు ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి 7 గంటలు చేశాడు. దాంట్లోనూ కోతలే. పంటలకు మద్దతు ధరలే లేవు. ఏపీ రైతులు మద్దతు ధరలు కోల్పోయారని కేంద్ర సంస్థ కూడా చెప్పింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే రైతులు మద్దతు ధర విషయంలో రూ.3 వేల కోట్లు నష్టపోయారు” అని వివరించారు.

వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ఎంత కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. సాక్షి పేపర్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం కాదు, వాస్తవాలు వెల్లడించాలని స్పష్టం చేశారు. లేకపోతే రైతులందరూ తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని సోమిరెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE