Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయ దుర్మార్గానికి న్యాయస్థానం చెంప దెబ్బ

-హంతకులను, పోలీసులను ఒక్కటి చేసే రాజకీయ దుర్మార్గానికి న్యాయస్థానం చెంప దెబ్బ
-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును ఇతర రాష్ట్రాలకు తరలించాలని సుప్రీమ్ కోర్ట్ ప్రాథమికంగా తీసుకొన్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో గత మూడేళ్ళుగా రాజకీయం నేర పూరితంగా మారిపోయింది. రౌడీలు, పోలీసులను ఒక్కటి చేసి రాజకీయం నడుపుతున్నారు. ప్రశ్నించే గొంతుకలు నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ నిర్బంధంలో చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.

వ్యాపారాలు నాశనం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలను కాదని బ్రతకలేని దుర్భర పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో పోలీసులు, హంతకులు ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారని తేలి పోయింది. దేశంలోనే గొప్ప పేరున్న దర్యాప్తు సంస్థ సి బి ఐ , ఈ కేసు దర్యాప్తులో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ సుప్రీమ్ కోర్టులో’దాఖలు చేసిన అఫిడవిట్ పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో స్పష్టం చేస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో దర్యాప్తు చేయడానికి తమ అధికారులు భయపడుతున్నారని, పోలీసులు తమను వేధిస్తున్నారని చాలా దీనంగా న్యాయస్థానానికి విన్నవించింది సి బి ఐ. అందువల్లనే ఈ కేసును ఇతర రాష్ట్రాలకు బదలీ చేయడానికి సహేతుకమైన కారణం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గుమాలిన తనం వేరొకటి ఉండదు. రాష్ట్రంలో పోలీస్ యంత్రంగం పని చేసేది ముఖ్యమంత్రి నేతృత్వంలో. లా అండ్ ఆర్డర్ మంత్రిత్వ శాఖ ఆయన వద్దనే వుంది. ఆయన నడిపించే పోలీసులు ఒక హత్య కేసు విషయంలో హంతకులకు మద్దతు ఇస్తూ, దర్యాప్తుకు అడ్డంకులు కలిగిస్తున్నారని సుప్రీమ్ కోర్ట్ నిర్ధారణ చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం క్షమించరాని విషయం.

రాజ్యాంగం మీద వీసమెత్తు మర్యాద వున్నా తక్షణం ముఖ్యమంత్రి గద్దె దిగి పోవాలి. ఆర్ టి సి బస్సుల జాతీయకరణ విషయంలో ప్రభుత్వం తొందరపాటు చూపిందని చిన్న వ్యాఖ్య , కోర్ట్ నుంచి వెలువడగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నీలం సంజీవ రెడ్డి వంటి రాజ్యాంగ బద్దులు పాలించిన రాష్ట్రం మనది. రాజకీయాలలో కొంచమైనా నీతి నియమాలు, రాజ్యాంగ నిర్దేశాలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి పాటించకుండా తప్పించుకోవాలని చూడడం, కోర్టులు అభిశంసించిన తర్వాత కూడా పదవిలో కొనసాగడం సిగ్గులేనితనం. న్యాయస్థానం నమ్మకం కోల్పోయిన ప్రభుత్వ ఉనికిలో అర్ధం లేదు.

LEAVE A RESPONSE