Suryaa.co.in

Andhra Pradesh

నాడు శ్మశానం,ఎడారి అన్నవారే…నేడు అప్పులకోసం వెంపర్లాడుతున్నారు

-నాడు అమరావతిని శ్మశానం, ఎడారి అన్నవారే, నేడు రాజధానిభూములు తాకట్టుతో అప్పులకోసం వెంపర్లాడుతున్నారు
– రూ.2,994కోట్ల అప్పుకోసమే 29గ్రామాల్లో 19 గ్రామాలనే అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ గా ప్రకటించారు
– అమరావతిలో ఏంచేయాలన్నా హైకోర్టు అనుమతి తప్పనిసరి, కాదని ముందుకెళ్లడం కోర్టు ధిక్కరణే అవుతుంది
• చంద్రబాబునాయుడికి పేరొస్తుంది అన్నదుగ్ధతోనే జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసంచేశాడు
• అదే అమరావతి భూములను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అప్పులు తెచ్చేహక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
• ఈ ముఖ్యమంత్రి ఆలోచనలు నిర్ణయాలతో, పోలీసులహింసతో 5కోట్లమంది ప్రజల్లో కోటిమంది నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు
– మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అమరావతి భూముల్ని తాకట్టు పెట్టి, వేలకోట్లుఅప్పులు పొంది, ఆ సొమ్ముని దిగమింగే క్రమంలోనే అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ అనేదాన్ని ఏర్పాటుచేసి, దానిపరిధిలోకి 29గ్రామాలను కాకుండా, కేవలం 19గ్రామాలనే ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈవ్యవహారమంతాకూడా రాజధానిరైతుల్ని మరింత మానసికక్షోభకు గురిచేయడానికే నని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయకార్యాలయంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు.ఆ వివరాలు ఆయనమాటల్లోనే ..

అమరావతి కోర్ కేపిటల్ ఏరియా 29 గ్రామాల్ని 19 గ్రామాలకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ అని కొత్తపేరు పెట్టారు. దాన్ని 19 గ్రామాలకు పరిమితం చేసి, రాజధానిలోనే ఉన్న 10 గ్రామాల్ని గాలికివదిలేశారు. కేవలం తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలో 3 గ్రామాలు తీసుకొని.. తాడేపల్లిమండలంలోని 2 గ్రామాలు మంగళగిరి మండలంలోని 4 గ్రామాలు, మరికొన్ని గ్రామాలను పక్కనపెట్టారు. కేవలం రాజధానిని డైల్యూట్ చేయాలన్నదురాలోచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజధానికోసం అన్నిగ్రామాలరైతులు భూములిచ్చారు. ఎక్కడైనాసరే, ఎవరైనా సరే రైతులు బువ్వపెడితేనే అందరం తినేపరిస్థితి ఉంది. అలాంటి రైతుల్ని మానసికక్షోభకు గురిచేస్తూ, ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. రాజధానిలో ప్రభుత్వం ఏంచేయాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, న్యాయస్థానాల అనుమతి తప్పనిసరని హైకోర్ట్ స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించి రాష్ట్రహైకోర్ట్ ఇచ్చిన స్టేటస్ కో ఇప్పటికీ అమల్లోఉంది. దాన్నిధిక్కరించేలా ప్రభుత్వం ఇప్పుడు 29గ్రామాలనుకాదని, 19గ్రామాలతో అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ కు శ్రీకారంచుట్టింది. రైతులుఇచ్చినభూముల్లో దాదాపు 481 ఎకరాలు, రూ.3,760కోట్లకు పైగా విలువచేస్తుందని, ఆ భూములతాకట్టుతో రూ.2,994కోట్లు అప్పుతీసుకోవాలని చూస్తున్నారు.

ఆక్రమంలో ఇప్పటికే డీపీఆర్ సిద్ధంచేశారుకూడా. 481 ఎకరాలు రూ.3,760కోట్లు అయితే, ఒక్కోఎకరా దాదాపు రూ.7కోట్లపైన పలుకుతోంది. అమరావతిని గురించి గతంలో పెద్దపెద్ద మంత్రులు, లావు మంత్రులంతా శ్మశానమని, ఎడారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అదే మంత్రులు, అదే ప్రభుత్వం బ్యాంకులకు తాకట్టుపెట్టడానికి తయారుచేసిన డీపీఆర్ లో ఎకరం భూమి విలువ రూ.7కోట్లని చెప్పారు. ఆ

లెక్కన చూసినా, మొత్తం రాజధానిరైతులిచ్చిన 34వేలఎకరాల విలువ రూ.2లక్షల38వేలకోట్లు అవుతుంది. బ్యాంకుల్లో తీసుకున రుణానికి సంబంధించి మొదటిరెండేళ్లు మారటోరియం అప్పుని 481ఎకరాలు అమ్మితీరుస్తామనిచెబుతున్నారు. తరువాత తీసుకునే అప్పులను 18 సంవత్సరాల వరకు దఫదఫాలుగా వాయిదాలు చెల్లిస్తామని, అప్పటికి భూమివిలువ ఎకరా రూ.17కోట్ల70లక్షలు అవుతుందంటున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని, ప్రధాన మంత్రి మాటల నమ్మి రైతులు 34వేలఎకరాలు ఇచ్చారు.

దానివిలువ రూ.2లక్షల38వేలకోట్లను బ్యాంకుకి చూపించి అప్పులు తీసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ ఆవిర్భావం జరిగింది. అంతిమంగా అప్పులుతీసుకొని రైతులగొంతుకోయాలి. ఇదేగా ప్రభుత్వఆలోచన. ఈముఖ్యమంత్రికి, మంత్రులకు రకరకాల వర్గాలను హింసిస్తే తప్ప నిద్రపట్టదా? ఐపీఎస్ లు, ఐఏఎస్ లు ప్రజలసొమ్మునే జీతాలుగా తీసుకుంటూ, ఆ ప్రజల జీవితాలను నాశనంచేసేలా పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలపై ఎలా సంతకాలు పెడతారు? ఐపీఎస్, ఐఏఎస్ వ్యవస్థలు ఎందుకింతలా నిర్వీర్యమయ్యాయి? 751 రోజులకు పైగా రైతులు,మహిళలు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా, కాళ్లుబొబ్బలెక్కేలా పాదయాత్ర చేసినా మీ మనస్సు కరగదా? రైతులపై ఎందుకింత కాఠిన్యం అని ప్రశ్నిస్త్తున్నాం? రాజధాని గ్రామాల్లోకి ప్రభుత్వం తరుపున వెళ్లిన స్పెషల్ ఆఫీసర్ కు అన్నిగ్రామాలప్రజలు తెగేసి చెప్పారు.

29గ్రామాలు ప్రభుత్వం చెబుతున్న అమరావతి మునిసిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ లోనే ఉండాలని కుండబద్ధలుకొట్టారు. రాజధానిపరిధిలోని గ్రామాల్లో ఓట్లుఉన్న ప్రజలే చేతులెత్తాలి అని సదరు ఆఫీసర్ అన్నారు. భూములిచ్చిన వారు అమరావతిలోనే ఉండాలా.. అనకాపల్లిలో అమెరికాలో ఉండకూడదా? అక్కడఉండేవారి అభిప్రాయాలను పట్టించుకోరా? జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ఓటుఉంది.. ఇళ్లేమో తాడేపల్లిలో, హైదరాబాద్ లో, బెంగుళూరులో ఉన్నాయి. కాపురం మాత్రం తాడేపల్లిలో ఉంటున్నాడు. మరి దానికేమంటారు? రైతులముందు ప్రభుత్వం తరుపున వెళ్లిన స్పెషల్ ఆఫీసర్లు తోకజాడించలేకపోయారు. అమరావతికి టీడీపీప్రభుత్వంలోనే ఒక పరిపూర్ణత వచ్చింది. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం చేశారు.

అలాంటి రాజధానిలో ఈ ప్రభుత్వం కేవలం రూ.2, లేదా రూ.3వేలకోట్లు ఖర్చుపెడితే చాలావరకు అన్నిహంగులు వచ్చేస్తాయి. అదిచేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసురావడంలేదు. అమరావతి కేంద్రంగా గుంటూరు, తెనాలి విజయవాడలు కలుపుతూ చంద్రబాబుగారు అవుటర్ రింగ్ రోడ్ కి ప్రణాళికలు సిద్ధంచేశారు. దానికి సంబంధించి 180కిలోమీటర్లకు టీడీపీప్రభుత్వంప్రణాళికలు సిద్ధంచేసి పంపితే ఆనాడుఉన్నకేంద్రప్రభుత్వం ఆమోదించిందికూడా. అంతాఅయ్యాక ఈ ప్రభుత్వం కేవలం 78కిలోమీటర్లు బైపాస్ చాలంటూ మెలికపెట్టింది. కేంద్రప్రభుత్వం అంతా ఒప్పుకొని భూములివ్వాలనిచెప్పాక ఏపీప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిని తగ్గించడమేంటి? కేంద్రప్రభుత్వమే వేలకోట్లతో రోడ్డువేస్తాము…భూములు సేకరించి ఇవ్వమంటుంటే, దానికి కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబుకే పేరొస్తుంది అన్న సంకుచిత మనస్తత్వంతో విషపు ఆలోచన చేయడం బాధాకరం.

నిజంగా అమరావతి ఓఆర్ఆర్ పూర్తైతే రాజధాని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. కానీ ఈ ముఖ్యమంత్రి అలాంటి ఆలోచనలు చేయకుండా, విధ్వంసం, వినాశనాలకే ప్రాధాన్యతఇస్తున్నాడు. అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ ఏదైతే ఈముఖ్యమంత్రి తీసుకొచ్చాడో, దానికి కోర్టు అనుమతి తీసుకోవాలి. రాజధానిలోని 29గ్రామాలను దానిలో కలపాలి. మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారుకదా.. అలానే అమరావతి రైతుల విషయంలోకూడా మంచిమనసు చేసుకోండి. కాదు..కూడదని ముందుకు వెళితే, అమరావతి విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తూ, కోర్టు ఉల్లంఘ నకు పాల్పడితే ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయొచ్చు. అమరావతి మూడు రాజధానుల బిల్లు రద్దైంది.
కావున ఆటోమేటిక్ గా సీఆర్డీఏ అమల్లోకి వస్తుంది. ముందుగా 29 గ్రామాలున్నప్పుడు 19 గ్రామాల కార్పొరేషన్ ను ఎలా ఏర్పాటు చేస్తారు? 481 ఎకరాలవిలువ రూ.3,760 కోట్లు ఉంటుందంటున్నారు. 2,994 కోట్లుఅప్పు తీసుకునేందుకు డీపీఆర్ సబ్ మిట్ చేశారు. శ్మశానం, ఎడారి, గ్రాఫిక్స్ అని విమర్శించిన వారు, ఇప్పుడు దాన్ని ఏ విధంగా తాకట్టుపెడతారు? అలాపెట్టే హక్కు మీకుందా.? రాజధాని రైతుల కుటుంబాలతో పాటు, రాష్ట్రంలోని కుటుంబాలను వేధిస్తున్నందుకు ఫలితం అనుభవించి తీరతారు.

అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఆ భూములను మీరు బ్యాంకుల్లో పెట్టి రుణాలెలా తీసుకుంటారు? మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? టీడీపీప్రభుత్వంలో అప్పులు ఇవ్వవద్దని ఇప్పుడున్న మీరే నాబార్డ్ వంటి సంస్థలకు లేఖలురాశారు. మరి మీరే ఇప్పుడు ఊళ్లో వాళ్ల ఆస్తులుతాకట్టుపెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ముందు అమరావతిలో చేయాల్సిన అభివృద్ధి చేయండి. భూములిచ్చినవారికి న్యాయంచేయకుండా ఆ భూములు బ్యాంకుల్లో ఎలాతాకట్టు పెడతారు? మొత్తం అంతా అభివృద్ధి చెందాక 9 ఎకరాలిచ్చిన రైతులకు తిరిగి 3 ఎకరాలు ఇవ్వాలి.

రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చేయాల్సింది చేయకుండా వాళ్లుఇచ్చినవి అమ్ముకొనో, అప్పులుతెచ్చుకొనో జల్సాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? మీరే ఒప్పుకున్నారు రాజధాని భూముల విలువ రూ.2లక్షలకోట్లుఅని. కోర్టులు, ప్రజలు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి తనవైఖరి మార్చుకోవడంలేదు. రాజధాని రైతులకు ప్రజలు బ్రహ్మరథం పట్టినాకూడా మూర్ఖంగా మంకుపట్టు పడితేఎలా? అమరావతి అభివృ ద్ధిచెందితే చంద్రబాబునాయుడికి పేరొస్తుందన్న ఒకేఒక దుగ్ధతోనే ఇలాచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తప్పుడుఆలోచనల ఫలితాలు ప్రజలుఅనుభవించాలా? ముఖ్యమంత్రి నిర్ణయాలు, పోలీసులహింసతో 5కోట్లమంది ప్రజల్లో కోటిమంది నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు.

LEAVE A RESPONSE