– ఏపీ బీజేపీలో హటాత్తుగా మారిన రాజకీయం
– పర్యటనలో ఉండగనే సోము వీర్రాజుకు షాక్
– రాజీనామా చేయాలని వీర్రాజుకు నద్దా ఫోన్
– అవమానకరరీతిలో తొలగింపు
– నాయకత్వ వైఫల్యమే కారణం
– అన్ని ఎన్నికల్లోనూ దారుణ పరాభవం
– సోము తీరుతోనే కన్నా రాజీనామా
– కొత్త దళపతిగా పురందీశ్వరి
– తెరపైకి బీజేపీ కమ్మ కార్డు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ బీజేపీలో అనుకోని కుదుపు. ఉరుము లేని మెరుపులా బీజేపీ తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఆ పదవి నుంచి తక్షణం తప్పిస్తూ, జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలను విస్మయపరిచింది. అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో ఉన్న సోము వీర్రాజుకు.. జాతీయ అధ్యక్షుడు నద్దా ఫోన్ చేసి, పార్టీకి రాజీనామా చేయమని ఆదేశించడంతో సోము షాక్ తినాల్సి వచ్చింది.
తెలంగాణ పార్టీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ నాయకత్వం.. చడీ చప్పుడు లేకుండా, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించింది. నిజానికి సోమును తొలగించి, ఆయన స్థానంలో కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, లేదా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను గానీ నియమిస్తారన్న ప్రచారం జరిగింది. అందులో భాగంగా అందరినీ సమన్వయం చేసుకోగల సుజనాకు, అధ్యక్ష పదవి ఇస్తారన్న చర్చ కూడా జరిగింది.
తొలుత సత్యకుమార్ అధ్యక్ష పదవి తీసుకునేందుకు.. విముఖంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో వెల్లడించాయి. అయితే అదే సమయంలో అటు సుజనా చౌదరి కూడా.. వైసీపీ సర్కారుపై పొరాడే వ్యక్తికి ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా తాను వెనుక ఉండి, పార్టీని నడిపిస్తానని నాయకత్వానికి చెప్పారన్న చర్చ కూడా జరిగింది. ఆ ప్రకారంగా అధ్యక్ష పదవి సుజనా లేదా సత్యలో ఒకరికి ఖరారవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరిగిన విషయం తెలిసిందే.
అయితే.. తెలంగాణ బీజేపీ అంతర్గత కుమ్ములాటలు ముదురుపాకాన పడటంతో, జాతీయ నాయకత్వం అటువైపు దృష్టి సారించింది. బండి సంజయ్‌ను తొలగించాలని సీనియర్లు పట్టుపట్టడం, ఈటల హటాత్తుగా ఢిల్లీ వెళ్లడం, ఆ తర్వాత సంజయ్‌ను పిలిపించడం, అదే సమయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా ఢిల్లీ వెళ్లడంతో, అందరి దృష్టి తెలంగాణ పార్టీపైనే కేంద్రీకృత మయింది.
దానితో కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చి, సంజయ్‌ను కేంద్రమంత్రివర్గంలో తీసుకుంటారని, ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్, రఘునందన్‌రావుకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తారన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చడీచప్పుడు లేకుండా, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించి, ఎవరూ ఊహించని పురందీశ్వరి పేరు ఖరారు కావడం బీజేపీ వర్గాలను ఖంగుతినిపించింది.
పురందీశ్వరి నియామకంతో, కమ్మ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే బీజేపీ ఎత్తుగడ బీజేపీ నాయకత్వ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మేరకు ఆమె కమ్మ వర్గాన్ని పార్టీకి ఏవిధంగా సానుకూలంగా మారుస్తారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ కూతురి కార్డు ఆమెకు ఎంతవరకూ కలసివస్తుందో చూడాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి సోము వీర్రాజుకు విఫల అధ్యక్షుడిగా ముందునుంచీ పేరుంది. ఆయన హయాంలో ఒక పార్లమెంటు, మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్లు దక్కిన దాఖలాలు లేవు. టీడీపీ పోటీ చేయని సందర్భంలో కూడా, బీజేపీ సత్తా చూపించలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కనీసం సగంలో సగం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను నిలబెట్టడంలో, విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో చేరిక వారి కంటే, సస్పెండ్ అయిన వారి సంఖ్యనే ఎక్కువ కావడం విశేషం.
వార్డు మెంబర్ల స్థాయి వారికి, రాష్ట్ర పదవులిచ్చారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ కార్యాలయాన్ని ఆయన మనుషులతో నింపేశారని, ముఖ్యంగా మీడియా కమిటీని గుప్పిట్లో పెట్టుకుని, తనకు నచ్చని వారిని పక్కనపెట్టారన్న విమర్శలున్నాయి. మీడియాపై నిషేధాజ్ఞలు విధించడంతో, ఏపీలో బీజేపీకి మీడియాలో స్థానం లేకుండా పోయింది. కోడిగుడ్డు వ్యాఖ్యలతో సొము అభాసుపాలయ్యారు.
సుదీర్ఘకాలం మంత్రి-ఎమ్మెల్యేగా పనిచేసి, సీఎం-పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. కేవలం సోము చర్యల వల్లనే పార్టీని వీడారన్న ప్రచారం, ఇప్పటికీ పార్టీ వర్గాల్లో లేకపోలేదు. తనకు నచ్చని వారిని, ప్రశ్నించేవారిని తప్పించడంపై, చాలామంది సీనియర్లు సోము వీర్రాజుపై నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
ముఖ్యంగా మిత్రపక్షమైన జనసేనతో సమన్వయం చేసుకోవడంలో, సోము విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. అందువల్లే పవన్ కల్యాణ్ పార్టీకి దూరమయిందని, వైసీపీ నేతలు పవన్‌పై వరస మాటల దాడి చేస్తున్నా, సోము స్పందించకపోవడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానంగా.. సోము వైసీపీ నాయకత్వంపై పోరాటంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. వైసీపీ సర్కారుకు అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో వైసీపీని వ్యతిరేకించే వర్గం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అధికారంలో ఉన్న వైసీపీకి బదలు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని విమర్శించడం బట్టి, అధికారపార్టీతో అంటకాగారన్న విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.
తమ విధులకు ఆటంకం కల్పించారన్న నేరంతో, విపక్షాలపై తరచూ కేసులు పెట్టే పోలీసులు… సోము వీర్రాజు ఓ సందర్భంగా సీఐ స్థాయి అధికారిపై లంఘించి, బెదిరించినా ఆయనపై కేసు పెట్టని విషయాన్ని బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సత్యకుమార్, సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి వైసీపీ సర్కారును దునుమాడుతుంటే.. అధ్యక్షుడిగా ఉన్న సోము మాత్రం.. జగన్ సర్కారుపై బంతిపూల యుద్ధం చేశారన్న విమర్శ మూటకట్టుకున్నారు.
కాగా గత రెండు రోజుల క్రితం సోము వీర్రాజుపై, కాకినాడకు చెందిన బీజేపీ సీనియర్ నేత యార్లగడ్డ రాంకుమార్.. పార్టీ అధ్యక్షుడు నద్దాకు రాసిన లేఖ ఒకటి తాజాగా సంచలనం సృష్టిస్తోంది. అందులో సోము ఒంటెత్తు పోకడను వివరించిన రాంకుమార్, తక్షణం చర్యలు తీసుకుని ఏపీ బీజేపీని కాపాడాలని లేఖ రాశారు.