విజయవాడ: అన్నపూర్ణాంధ్రను అప్పుల ఆంధ్రగా మార్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి.. ఇప్పుడేమో ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి బలహీనతపై డబ్బు సంపాదించడం దారుణమని మండిపడ్డారు. మద్యాన్ని ఏరులై పారిస్తూ పేదల రక్తం తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వైకాపా పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. మంత్రులు పరిపాలన మీద కాకుండా ప్రతిపక్ష పార్టీలను దూషించడంపై దృష్టి పెట్టారని మండిపడ్డారు.
‘‘మా పార్టీని ఎవరో ఇద్దరికి లీజ్ ఇచ్చామని మాట్లాడారు. భాజపాను ఎవరికీ లీజ్ ఇవ్వలేదు. తెదేపా, వైకాపా నేతలు ఎవరు ఎవరికి లీజుకిచ్చారో నాకు తెలుసు. తెదేపా నుంచి వైకాపాకు వచ్చిన వారికి ఏం లీజుకిచ్చారో చెప్పమంటారా?మీ లీజుల గురించి మేం మాట్లాడితే చొక్కాలు ఊడిపోతాయి.మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడమని పేర్నినానికి వినమ్రంగా చెబుతున్నాను. ఏపీలో రాజకీయ శూన్యత ఉంది.. భాజపా ఇకపై దూకుడుగా వెళ్లబోతోంది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై భాజపా పోరుబాట పట్టబోతోంది. ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలపై భాజపా దృష్టి సారిస్తోంది’’ అని సోము వీర్రాజు అన్నారు.