Suryaa.co.in

Business News Telangana

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

– తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న డెయిరీ దిగ్గజం అమూల్
– దక్షిణ భారతదేశంలో అమూల్ ఏర్పాటు చేయనున్న తొలి ప్లాంట్ ఇదే

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది. సుమారు 500 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఈరోజు అమూల్ కంపెనీ తెలిపింది. ఈరోజు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తో సమావేశమైన అమూల్ ప్రతినిధి బృందం ఈ మేరకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమూల్ కంపెనీకి మంత్రి కే. తారకరామారావు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని, ఈ దిశగా వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాల వలన రాష్ట్రంలో పాడి రంగం భారీగా అభివృద్ధి చెందిందని, తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందని తెలిపారు.

ఇలాంటి నేపథ్యంలో పెట్టుబడి పెట్టేందుకు అమూల్ తెలంగాణను ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడి పరిశ్రమకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమూల్ దేశ పాడి పరిశ్రమ రూపురేఖలు మార్చిందని, ప్రపంచానికి పాడి రంగంలో గొప్ప పాఠాలు చెప్పిన కంపెనీ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తన తొలి డెయిరీ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం పట్ల కంపెనీకి అభినందనలు తెలిపారు.

తెలంగాణలో ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో రెండు దశల్లో మొత్తం ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు అమూల్ తెలిపింది. దక్షిణ భారతదేశంలోనే అమూల్ తన తొలి ప్లాంట్ ను ఐదు లక్షల లీటర్ల ప్రతిరోజు సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు, భవిష్యత్తులో దీన్ని పదిలక్షల లీటర్ల కు పెంచుకకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా బట్టర్ మిల్క్, పెరుగు, లస్సి, పన్నీర్, స్వీట్స్ వంటి ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

దీంతోపాటు అమూల్ తన బేకరీ ప్రొడక్షన్ డివిజన్ ను తెలంగాణలో ఏర్పాటు చేసి బ్రెడ్, బిస్కెట్ మరియు ఇతర బేకరీ ప్రొడక్టులను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణ లో తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్ రానున్న 18 నుంచి 24 నెలలు లోపల తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ రైతుల నుంచే సేకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి అమూల్ కంపెనీ హామీ ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వంతో ఎం ఓ యు చేసుకున్న నేపథ్యంలో అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎస్ సోది తన శుభాకాంక్షలను తెలిపారు. ఈ రోజు వ్యక్తిగత కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయానని, త్వరలోనే తెలంగాణలో తమ కంపెనీ నీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని తెలిపారు.

అమూల్ కంపెనీ తరఫున సభార్కంత జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోపరేటివ్ సొసైటీ యూనియన్ యండి బాబు భాయ్ యం పటేల్, మరియు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ లు, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE