Suryaa.co.in

Telangana

అంబేద్కర్‌ కు రేవంత్ రెడ్డి నివాళులు

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 133వ జయంతి (ఏప్రిల్ 14వ తేదీ) పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటు పడిన మహానీయుడు అంబేద్కర్‌ అని సీఎం కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు.

దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్‌ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రానికి జవజీవం పోసిందని గుర్తు చేసుకున్నారు.

ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని అన్నారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తుందని తెలిపారు.

LEAVE A RESPONSE