Suryaa.co.in

Andhra Pradesh

ఆస్తులు పెంచుకోవడమే సోము వీర్రాజు లక్ష్యం

– పవన్ కల్యాణ్ ఫొటో ఎందుకు తీసేయమంటున్నారు?
– జనసేన బీజేపీ మిత్రపక్షం కాదా?
– పార్టీని వైసీపీకి తాకట్టు పెట్టారు
– సునీల్ దియోధర్, మధుకర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
– రావెల కిషోర్ బాబు పార్టీని వీడినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు.
– కన్నా వర్గీయులమనే మమ్మల్ని తొలగించారు
– నిరసనగా మేమంతా రాజీనామా చేస్తున్నాం
– పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ల స్పష్టీకరణ
– సోముపై బీజేపీ నేతల తిరుగుబాటు

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై తిరుగుబాటు మొదలయింది. సరిగ్గా భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న రోజునే.. పల్నాడు-శ్రీకాకుళం జిల్లా నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. భారీ సంఖ్యలో తమ పదవులకు రాజీనామా చేసి, ఆయన తీరును ఎండగట్టారు. పనిలో పనిగా పార్టీ ఇన్చార్జి సునీల్ దియోధర్- సంఘటనా మంత్రి మధకర్ విధానాలను తూర్పారపట్టారు.

రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెత్తు పోకడను ఇంకా భరించడం తమ వల్లకాదని, పల్నాడు జిల్లా బీజేపీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ ఫొటో పెడితే, దానిని తొలగించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి చెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.

ఆస్తులు పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలో బీజేపీని పెంచాలని సోము వీర్రాజుకు ఏమాత్రం లేదని.. పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సైదారావు ఆరోపించారు. మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ ఫోటో పెడితే తప్పా అని ప్రశ్నించారు. అంటే మనం పవన్‌ను రాజకీయంగా మోసం చేస్తున్నామా? అసలు జనసేనపై మన వైఖరి ఏంటి అని నిలదీశారు.

వీర్రాజు రాష్ట్రంలో పార్టీని వైసీపీకి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. సోము హయాంలోకష్టపడి పనిచేసే కార్యకర్తలకు, ఆత్మాభిమానం ఉన్న నాయకులకు స్థానం లేదన్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి జిల్లాలో పార్టీకి పనిచేసిన తమను తొలగించిన వీర్రాజును తొలగిస్తే తప్ప, రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోథర్, సంఘటనా మంత్రి మధుకర్‌కు సోము తీరుపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటే, రాష్ట్ర నాయకత్వంలో ఏం జరుగుతోందో జాతీయ నాయకత్వం అర్ధం చేసుకోవాలన్నారు. కేవలం కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులమనే కారణంతోనే తమను తొలగించారని, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం సమాచారం ఇవ్వలేదన్నారు.

పెదకూరపాడు అసెంబ్లీ ఇన్చార్జి గంధం కోటేశ్వరరావు మాట్లాడుతూ ..
కన్నా వర్గమనే పేరుతో చాలామందిని సోము పక్కన పెట్టారు. రావెల కిషోర్ బాబు పార్టీని వీడినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు.ముఖ్యనేతల సేవలను ఎందుకు వినియోగించుకోలేదు? 120 మంది నేతలు కార్యకర్తలు పార్టీ పదవులకు, పార్టీకీ రాజీనామా చేస్తున్నాం అని ప్రకటించారు.

LEAVE A RESPONSE