– ప్రధాని టూర్‌పై బీజేపీలో గందరగోళం
– విజయసాయిరెడ్డికి ఎలా తెలుస్తున్నాయంటూ సోముపై సీనియర్ల ఎదురుదాడి
– ప్రధాని టూర్ ముందుగా బీజేపీకి చెబుతారా? వైసీపీకి చెబుతారా అంటూ ప్రశ్నల వర్షం
– విజయసాయిని విమర్శించవద్దంటూ సోము ఆగ్రహం
– కోర్ కమిటీకి చెప్పరా అని సీనియర్ల సీరియస్
– ఎంపీ సీఎం రమేష్, సత్యకుమార్‌తో సోము వీర్రాజు వాగ్వాదం
– అందరి బతుకులూ తనకు తెలుసంటూ సోము ఎదురుదాడి
– పార్టీని తాకట్టుపెడుతున్నారంటూ కొందరిపై సోము ఫైర్
– తేల్చుకుందామంటూ సీఎం రమేష్ ఎదురుదాడి
– కోర్ కమిటీని విశ్వాసంలోకి తీసుకోరా అన్న సత్యకుమార్
– ప్రొటోకాల్ పంచాయితీకి తెరలేపిన పురంధీశ్వరి
– సీనియర్లకు బాసటగా నిలిచిన పురంధీశ్వరి
– సోము వ్యాఖ్యలు తప్పుపట్టిన కేంద్రమంత్రి మురళీధరన్
– కిషన్‌రెడ్డితో మాట్లాడాలని మురళీధరన్ సూచన
– శివప్రకాష్‌తో మాట్లాడతానన్న సునీల్ దియోథర్
– వాడి వేడిగా ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రధాని మోదీ విశాఖ పర్యటన వ్యవహారం ఏపీ బీజేపీ కోర్ కమిటీలో గందరగోళానికి దారితీసింది. పార్టీ నేతలకు తెలియకుండా, వైసీపీ ఆ కార్యక్రమాన్ని హైజాక్ చేస్తోందంటూ బీజేపీ సీనియర్లు విరుచుకుపడ్డారు. బీజేపీ భాగస్వామ్యం లేకుండా.. ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డిఎలా సమీక్షిస్తారని, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును సీనియర్లు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ సందర్భంగా ఆగ్రహించిన సోము వీర్రాజు.. మీ అందరి సంగతి నాకు తెలుసు. పార్టీని ఎవరు ఎవరికి తాకట్టు పెడుతున్నారో, ఎవరి బతుకులేమిటో నాకు తెలుస’న్న వ్యాఖ్యలపై సీనియర్లు సోముపై విరుచుకుపడ్డారు.
అయితే.. ‘మాకూ ఎవరి చరిత్ర ఏమిటో, ఎవరి బతుకేమిటో తెలుసు. మేమూ ఎక్కడ తేల్చుకోవాలో అక్కడ తేల్చుకుంటాం’అని సీనియర్లు ఎదురుదాడి చేశారు. కేంద్రమంత్రి, రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్ జోక్యం చేసుకుని..అందరితో సమన్వయం చేసుకోవాలని, ఆవిధంగా వ్యాఖ్యానించడం మంచిదికాదని సోముకు హితవు పలికారు. ఇదీ వాడి వేడిగా జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ తీరు.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 11న ప్రధాని మోదీ విశాఖకు వస్తున్న సందర్భంగా, ఏర్పాట్లపై ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ జరిగింది. దానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధీశ్వరి.. కోర్ కమిటీలో చర్చించకుండా, ప్రధాని దృష్టికి ఏయే అంశాలు తీసుకువెళ్లాలన్న దానిపై చర్చించకుండా, విశాఖలో చర్చించి ఇక్కడ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ప్రధాని కార్యక్రమం ముందుగా తెలియాల్సింది వైసీపీకా? బీజేపీకా అని ప్రశ్నించారు.
దానికి స్పందించిన అధ్యక్షుడు సోము వీర్రాజు.. 25 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న తనకు ఏమి చేయాలో, ఎలా చేయాలో చెప్పాల్సిన పనిలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనితో జోక్యం చేసుకున్న సీనియర్లు.. విశాఖలో జిల్లా స్థాయిలో సమావేశం పెట్టి, ఇక్కడ చర్చించడం, కోర్ కమిటీని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన పనిలేదా? అని సోము వీర్రాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
సీఎం రమేష్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని కార్యక్రమాన్ని విజయసాయిరెడ్డి ఎలా సమీక్షిస్తారని, అందులో బీజేపీ పాత్ర ఏమీ లేదా? పార్టీ భాగస్వామ్యం ఉండదా? మనకు లేని సమాచారం విజయసాయిరెడ్డికి ఎలా వస్తోంది? ఆయనకు ఎవరిస్తున్నారు? కోర్ కమిటీ ఉంది ఎందుకు?’’ అని అధ్యక్షుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
దానితో ఆగ్రహించిన సోము వీర్రాజు.. ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శించవద్దని, ఆయనకు పీఎంఓ నుంచి సమాచారం వచ్చి ఉంటుందని సమర్ధించే ప్రయత్నం చేశారు. సునీల్ దియోధర్ కూడా వీర్రాజును సమర్ధించారు. దానికి కొనసాగింపుగా.. ‘మీ సంగతి నాకు తెలుసు. ఎవరి బతుకులేమిటో కూడా తెలుసు. ఇక్కడ ఎవరు, పార్టీని ఎవరు ఎవరికి తాకట్టు పెడుతున్నారో, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. వాళ్ల పేర్లు చెప్పమంటారా? పార్టీని నాశనం చేస్తున్నారు’ అంటూ వీర్రాజు విరుచుకుపడంతో, సీనియర్లు బిత్తరపోయారు.
దీనితో ఆగ్రహించిన సీఎం రమేష్.. మీ బతుకులు కూడా తనకు తెలుసని, ఎవరి బతుకేమిటో చెప్పాల్సిన చోట తేల్చుకుంటామని ఎదురుదాడి చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీనియర్లు ‘అసలు ఇక్కడ మాట్లాడుకుంటున్న అంశం ఏమిటి? మీరు చేస్తున్న విమర్శలేమిటి? సీనియర్లపై వ్యక్తిగత దూషణలు ఎలా చేస్తారు? ఇదేం పద్ధతి? విజయసాయిరెడ్డి జోక్యం గురించి మాట్లాడుతుంటే, మీకేం ఇబ్బంది’ అని.. సోముపై మూకుమ్మడి ఎదురుదాడి చేయడంతో, వాతావరణం వేడెక్కింది.
ఆ క్రమంలో జోక్యం చేసుకున్న కేంద్రమంత్రి మురళీధరన్.. అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన మీరు, ఆవిధంగా సంయమనం కోల్పోవడం సరైంది కాదని సోముకు హితవు పలికారు. ఈ దశలో కొందరు సీనియర్లు ‘మీరు ఇంగ్లీషులో చెబుతున్నారు. అధ్యక్షుడికి తెలుగు తప్ప హిందీ-ఇంగ్లీషు రాదు. కాబట్టి ట్రాన్స్‌లేటర్‌ను పెట్టాలి’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మురళీధర్ మాట్లాడుతూ ప్రధాని టూర్ ఏర్పాట్లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో చర్చించారా? అని ప్రశ్నించారు. తాను కేరళ వరకే పరిమితం అని, రెండు తెలుగురాష్ర్టాల్లో ప్రధాని టూర్‌ను కిషన్‌రెడ్డి కో ఆర్డినేట్ చేస్తారని వివరించారు. ఒకసారి కిషన్‌రెడ్డితో మాట్లాడాలని సూచించారు. అయితే తాము బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌తో మాట్లాడుతున్నామని, బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దియోధర్ బదులిచ్చారు. శివప్రకాష్‌తో మాట్లాడి, రేపు మీకు పూర్తి వివరాలు చెబుతానన్నారు.