-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
మద్యపాన నిషేధం అని మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మద్యపాన నిషేధం చేయకుండా ఆ పేరు చెప్పి పేదవాడి రెక్కల కష్టాన్ని రాబందుల్లా దోచుకుతింటున్న మీవి మరుగుజ్జు ఆలోచనలు విజయసాయిరెడ్డి గారూ. విచ్చలవిడిగా రేట్లు పెంచేసి మద్యం అమ్ముకుంటూ ఆ వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుకుంటున్న మీరా మా గురించి మాట్లాడేది. ఇంతవరకు రాష్ట్రంలో ఎన్ని డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఎంతమందిని మద్యం తాగకుండా అదుపు చేయగలిగారో శ్వేత పత్రం విడుదల చేయండి. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద వచ్చే ఆదాయం వేల కోట్లు పెరగడం వాస్తవం కాదా? మీకు దమ్ముంటే మద్యపాన నిషేధం చేసి ఆ తర్వాత మా గురించి ఆలోచన చేయండి. మద్యపాన నిషేధం చేసి మీరు కనీసం ఒక్కరోజైనా ప్రభుత్వాన్ని నడపగలరా?? అలాంటి దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు, అందుకు మీరు సిగ్గుపడాలి.
పేర్ల మార్పు గురించి మేము గతంలోనూ పోరాటాలు చేశాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము, భవిష్యత్తులోనూ చేస్తాము. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో కూడా ఇప్పటికీ దేశ ద్రోహుల పేర్లను అలాగే వాడుకలో పెడితే ఓట్ల కోసం మీరు సర్దుకోవచ్చేమో కానీ, మేము జాతీయతకే మొదటి ప్రాధాన్యతనిస్తాము. కాబట్టి, మీరు పేర్లు మార్చే వరకూ మేము పోరాటాలను కొనసాగిస్తాము, అప్పటికీ మార్చకపోతే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మారుస్తాము.
లేని,రాని ప్రత్యేక హోదా గురించి మీకు తెలిసి కూడా మాకు ఇంతమంది ఎంపీలను గెలిపించండి, మేము కేంద్రం మెడలు వంచి సాధించి తీరుతాం అంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని తీరా ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్రంలో బిజెపికి పూర్తి మెజారిటీ వచ్చింది, కాబట్టి మనం ఏమీ చేయలేము అని మీడియా సమావేశం పెట్టి నిస్సిగ్గుగా పక్కకు తప్పుకొని రాష్ట్ర ప్రజలను మొదటిరోజే మీరు, మీ నాయకుడు మోసం చేసింది వాస్తవం కాదా?
మీరు ఇచ్చిన హామీలను మమ్మల్ని సాధించుకురమ్మనటంలోనే మీ ఘోర వైఫల్యం కనిపిస్తోంది. మీకు అసలు మాట్లాడే హక్కు కూడా లేదు.నాటి ముఖ్యమంత్రి మాకు హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టి మాట్లాడలేదా? ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మాణం చేయలేదా? మళ్లీ ఇప్పుడు హోదా పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.
పోలవరం నిధుల గురించి మాట్లాడుతున్నారు, నరేంద్రమోదీ ప్రభుత్వం నిధులివ్వకపోతే మీ ప్రభుత్వాలకు ఒక పిల్లర్ అయినా వేసే పరిస్థితి ఉందా? ఇప్పటి వరకూ అక్కడ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినదే, పూర్తి చేసేది కూడా నరేంద్రమోదీ ప్రభుత్వమే. అక్కడి కాంట్రాక్టులలో నిధులు కొల్లగొడదామని నాటి ప్రభుత్వం, రివర్స్ టెండరింగ్ అంటూ మీ ప్రభుత్వం నిధులు కొల్లగొడుతుంటే నరేంద్రమోదీ ప్రభుత్వం ఇస్తున్న డబ్బులకు లెక్కలు అడగకుండా పేదల బాగోగులు మానేసి, మీ కడుపులు నింపటానికి ప్రయత్నం చేస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలు చెప్పిన తరువాతే నిధులు విడుదల చేస్తుంది, మీ ఇష్టం వచ్చినట్లు ఒక్కోసారి ఒక్కో లెక్కలు చెప్పి కొల్లగొడదామనుకుంటే మా దగ్గర కుదరదు!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఉందా? మీ నాయకుడితో వివిధ కంపెనీల ప్రతినిధులు చర్చలు జరిపినది వాస్తవం కాదా? మీకు తెలీకుండానే కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణను ఇంతదూరం తీసుకువచ్చిందా? ఇలాంటి దొంగ పోరాటాలు ఇంకెంతకాలం చేస్తారు? ప్రజలను ఇంకెంతకాలం మభ్యపెడతారు? అంతర్గతంగా మీరు మద్దతు తెలిపి, నేడు కమ్యూనిస్టు కార్మికుల వ్యతిరేకత ఉందని ఆ వ్యతిరేకతను మాపై మరల్చటానికి, మమ్మల్ని ఆపమని ప్రజల ముందు మాట్లాడటానికి సిగ్గు లేదా?
స్టీల్ ప్లాంట్ పై పార్లమెంటులో కనీసం ఒక ప్లకార్డు పట్టుకోమని మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సవాల్ విసిరితే, మీకున్న ఎంపీలలో మీతో సహా కనీసం ఒక్కరికి కూడా ప్లకార్డు పట్టుకునే దమ్ము లేకపోయింది. ఇందుకు కారణం మీరు అంతర్గతంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు మద్దతు తెలిపారు కాబట్టి, ఆ సాహసం చేయలేకపోయారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెబుతోంది, స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెల్లదు, వైజాగ్ లోనే ఉంటుంది, మునుపటి కంటే అత్యున్నత వృద్ధితో దూసుకెళుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో దాదాపు అన్ని హామీలను నరేంద్రమోదీ ప్రభుత్వం నెరవేర్చింది, పెండింగులో ఉన్న ఒకట్రెండు హామీలను త్వరలోనే నెరవేరుస్తుంది.గత ఏడున్నర సంవత్సరాలుగా నరేంద్రమోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అందులో గ్రామం మొదలుకొని అన్ని రకాల రహదారులను, రైల్వే కనెక్టివిటీని, విమాన కనెక్టివిటీని అభివృద్ధి చేసింది, చేస్తోంది. లక్షలాది ఇళ్ళను మంజూరు చేసింది. పేదల జీవితాలను మెరుగుపరచడానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది.
మీరు కనీసం రోడ్డుపై ఉన్న గుంతనైనా పూడ్చారా? ఒక్క ఇంటినైనా నిర్మించి ఇచ్చారా? ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేసి డబ్బులు పంచడానికా మీకు అవకాశం ఇచ్చింది?రాష్ట్ర ప్రజలకు మీ అసలు స్వరూపం ఇప్పటికే కొంచెం తెలిసింది, మిగతాది తెలియజేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది, మీ అధికార అహంకారాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించి మిమ్మల్ని నడిరోడ్డుపై నిలబెడుతుంది!