బీఆర్ఎస్ కాంగ్రెస్ సీ టీమ్.. కాంగ్రెస్ బీఆర్ఎస్ సీ టీమ్
బీసీల ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ ఏనాడూ పట్టించుకోలేదు
బీఆర్ఎస్ నేతల్లో అహంకారం
అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు
ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీ
బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు
బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమే
బీసీ ఆత్మ గౌరవ సభ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధానమంత్రి 0నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామివారిని స్మరించుకున్నారు.
నా కుటుంబసభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగించిన మోదీ.. ‘మీ ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యాను.. మీ ఆశీర్వాదంతోనే త్వరలో బీజేపీ బీసీ వ్యక్తి సీఎం అవుతారు’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు వచ్చిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలను చూస్తుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీపైనే విశ్వాసంతో ఉన్నారన్న ఆయన.. అన్నివర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి విరోధి, బీసీ విరోధి, ఎస్సీ, ఎస్టీ విరోధిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ మూడింటి విషయంలో బీఆర్ఎస్ మోసం చేసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారు. స్వరాష్ట్రంలో బీసీలను మోసం చేశారు. బీసీల ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ ఏనాడూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ సీ టీమ్ అని.. కాంగ్రెస్ బీఆర్ఎస్ సీ టీమ్ అని ఆరోపించారు. రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని చెప్పారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్షణాలని ఆక్షేపించారు.
బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారని అన్నారు. అంతేకాదు.. పార్లమెంట్లో దాదాపు 85 మందికి పైగా బీసీ ఎంపీలు ఉన్నారని వెల్లడించారు.ల అబ్దుల్ కలామ్, రామ్నాథ్ కోవింద్, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘటన భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్నారు. ఈ క్రమంలోనే ఓబీసీని అయిన తనను ప్రధానిని చేసింది, ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీ అని చెప్పారు. బీసీ యువత కోసం బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయట్లేదని.. వారికి రూ.లక్ష ఇస్తామని వాగ్దానం చేసి నెరవేర్చలేదని విమర్శించారు.
తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదని.. తెలంగాణలో మార్పు తుఫాను కనిపిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అన్ని నియామకాల పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయని మోదీ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు వున్నాయని.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వారి నుంచి తిరిగి రాబడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని ప్రధాని మండిపడ్డారు. అవినీతి సర్కారును ఇంటికి పంపడం తథ్యమన్నారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆరోపించారు. తెలంగాణ యువతను కేసీఆర్ సర్కారు మోసం చేసిందన్న మోదీ.. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ.. యువత జీవితాలను దుర్భరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
యువతను మోసం చేసిన బీఆర్ఎస్ను ఇంటికి పంపాలా.. వద్దా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించగా.. ముక్తకంఠంతో పంపించాలంటూ నినదించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తామని.. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని స్పష్టం చేశారు.