ఐక్యరాజ్యసమితి జనాభా నిధి తాజా నివేదికలో ఆసక్తికర అంచనాలు
ఎంపీ విజయసాయిరెడ్డి
.
ఇండియాలో అభివృద్ధి అనుకున్న స్థాయిలో లేకపోవడానికి, పేదరికానికి ప్రధాన కారణం అదుపు లేకుండా పెరుగుతున్న జనాభాయేనని 1960లు, 70లు, 80ల్లో ప్రపంచ ప్రగతి నిపుణులు, కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెప్పేవారు. 1990ల నుంచీ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యం పెరిగింది. టెక్నాలజీ, సంబంధిత నైపుణ్యాలు పెంచుకోవడంపై ప్రభుత్వాలు, రాజకీయపక్షాలు దృష్టి కేంద్రీకరించాయి.
అయినా, ఇండియాలో జనాభా పెరుగుదల గతంలో మాదిరి వేగంగా లేకున్నా చైనా జనసంఖ్యను ఈ ఏడాది దాటిపోయే పరిస్థితి వచ్చింది. కిందటి దేశ జనగణన జరిగిన 2011 నుంచి ఇండియాలో జనాభా వృద్ధి రేటు 1.2 శాతం ఉందని, అంతకు ముందు పదేళ్లలో ఇది 1.7% ఉండేదని బుధవారం ఐక్యరాజ్యసమితి (ఐరాస) విడుదల చేసిన ప్రపంచ జనాభా గణాంకాలు చెబుతున్నాయి. చైనా జనాభాను భారత జనాభా ఈ నెలలోనే మించిపోతుందని ఐరాస పాత సంఖ్యా వివరాల ఆధారంగా అంతర్జాతీయ జనాభా నిపుణులు అంచనావేశారు.
అయితే, ఈ రెండు ఆసియా దేశాల నుంచి వాటి జనసంఖ్య వృద్ధికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు అందుబాటులోకి రావకపోవడం వల్ల ఏ నెలలో చైనాను భారత్ దాటిపోతుందో చెప్పడం కష్టమని ఐరాస తెలిపింది. రెండు దేశాల్లో జనసంఖ్య పెరుగుదల నెమ్మదించినప్పటికీ, ఇండియాతో పోల్చితే చైనాలోనే జనాభా వృద్ధి రేటు ఎక్కువ తగ్గుతోంది. అరవై ఏళ్లలో మొదటిసారి చైనాలో కిందటేడాది దేశ జనాభా తగ్గింది.
ఈ చారిత్రక మార్పు ఫలితంగా అతిపెద్ద అర్థికవ్యవస్థల్లో ముందు వరుసలో ఉన్న చైనాలో తీవ్ర వ్యతిరేక పర్యవసానాలకు దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు. చైనాలో గత ఏడాది మొదలైన జనాభా తగ్గుదల దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని, దాని ప్రభావం దాని ఆర్థికవ్యవస్థపైనా, ప్రపంచంపైనా ఉంటుందని కూడా జనాభా నిపుణులు అంటున్నారు.
చైనా, ఇండియా జనాభా మొత్తం జనాభా కలిపితే ప్రపంచ ప్రస్తుత జనాభా (800కోట్లు)లో మూడో వంతు అవుతుంది. శరవేగంతో ఆర్థికవ్యవస్థలు ముందుకు దూసుకెళ్లున్న ఈ రెండు ఆసియా దిగ్గజాల భూభాగాల్లోనే ప్రపంచంలోని మూడో వంతు మానవులు నివసించడం నిజంగా విశేషం.
జనాభా పెరుగుదలపై ఇండియా ప్రజల్లో ఆందోళన, అలజడి?
దేశంలో మొత్తం జనాభా చైనా జనసంఖ్యను దాటిపోవడం, క్రమంగా దేశ జనాభా పెరుగుతూ పోవడంపై భారత ప్రజల్లో ఆందోళన, అలజడి కనిపిస్తున్నాయని ఐరాస సర్వే నిపుణులు వెల్లడించారు. ‘జనసంఖ్య వృద్ధిపై అత్యధిక ప్రజానీకంలో దిగులు వ్యక్తమౌతోంది. జనాభా పెరుగుతోందనే సమాచారం ప్రజల్లో కంగారుకు, అనవసర ఆందోళనకు దారితీయకూడదు. వాస్తవానికి పెరుగుతున్న జనాభా దేశ ప్రగతి, అభివృద్ధికి చిహ్నంగా చూడాలి.
జన సంఖ్య పెరుగుతున్నా వ్యక్తిగత హక్కులు, పెరుగుతున్న ఆశలు తీరే వాతావరణం కొనసాగితే ప్రగతికి జనాభా దర్పణంగా భావించాలి,’ అని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ ఎఫ్ పీఏ) భారత విభాగం ప్రతినిధి ఆందియా వోజ్నర్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ జనాభా స్థితిగతుల నివేదిక’ను యూఎన్ ఎఫ్ పీఏ బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత జనాభా 142 కోట్ల 86 లక్షలు అని, చైనా జనసంఖ్య 142 కోట్ల 57 లక్షలని అంచనా. కాగా, అగ్రరాజ్యం అమెరికా 34 కోట్ల జనాభాతో ప్రపంచంలో ఈ రెండు ఆసియా దిగ్గజాల తర్వాత మూడో స్థానంలో ఉంది. 2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వచ్చిన గణాంకాల ఆధారంగా ఐరాస అనుబంధ సంస్థ యూఎన్ ఎఫ్ పీఏ ఈ అంచనాలు వేసింది.
ఈ ఏడాది మధ్య నాటికి (జులై ఒకటికి) ఇండియా జనాభా చైనా జనసంఖ్య కన్నా 29 లక్షలు ఎక్కువ ఉంటుందని కూడా యూఎన్ ఎఫ్ పీఏ భావిస్తోంది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం జనాభా పెరుగుదల ఒక దేశం వెనుకబాటుతనానికి దర్పణంగా పరిగణించేవారు. ఇప్పుడు అత్యధిక యువత ఉన్న దేశంలో జనసంఖ్య పెరుగుదల ఆ దేశం ప్రగతికి దోహదం చేస్తుందనే సిద్ధాంతం చాలా వరకు ప్రచారంలో ఉంది. అసలు ఒక దేశంలో జనాభా పెరుగుదల లేదా తగ్గిపోవడానికి ఖచ్చితమైన కారణాలను చెప్పడం కష్టమని జనాభా నిపుణులు ఎప్పటి నుంచో భావిస్తున్నారు.