-అడ్డం తిరుగుతున్న ఐఏఎస్‌లు?
-సీఎస్‌కు స్పష్టం చేసిన ఐఏఎస్‌లు
-విశాఖ కేంద్రంగా పాలన సాధ్యమేనా?
-ప్లేస్ ఆఫ్ వర్క్‌ను నోటిఫై చేయకుండా ప్రభుత్వ శాఖలను తరలించేస్తే ఎలా?
-ఉద్యోగులు, సిబ్బందికి ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది కీలకమైన అంశం
-విమ్స్ ప్రాంగణాన్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చా?
‘‘మీరు ఫలానా తేదీన రావాలని చెబితే వచ్చి పోతాం. అంతేకానీ విశాఖలో పర్మినెంటుగా ఉండాలంటే మేం ఉండం. ఇది బిజినెస్ రూల్స్‌కు విరుద్ధం. ప్లేస్ ఆఫ్ వర్కును మార్చేందుకు సరైన ఉత్తర్వులు ఇవ్వకుండా, విశాఖలో క్యాంపు ఆఫీసులు ఏర్పాటుచేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది?’’ ఇదీ.. విశాఖకు రాజధానిని తరలించి, అక్కడే మంత్రులు, ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల క్యాంపు ఆఫీసులకు నడుంబిగించిన సర్కారుపై.. సీనియర్ ఐఏఎస్ అధికారులు సంధిస్తున్న ప్రశ్నలు. సీఎస్‌కు స్వయంగా తమ సందేహాలు వ్యక్తం చేయడమే కాదు. తాము విశాఖకు పర్మినెంట్‌గా రావటం కుదరదని, నిర్మొహమాటంగా చెప్పేశారట. కాకపోతే.. మీరు ఫలానా తేదీన మీటింగు ఉందని చెబితే మాత్రం, తప్పనిసరిగా వస్తామని కుండబద్దలు కొట్టారట. ఇప్పుడిది అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వైసీపీ సర్కార్ హడావుడి చేస్తుంటే అధికారులు కీలక సందేహాలు లేవనెత్తుతున్నారు. దీంతో విశాఖ కేంద్రంగా పాలన సాధ్యమేనా అనే సందేహాలు తొలుస్తున్నాయి. డిసెంబరు 8 నుంచి విశాఖ కేంద్రంగా.. పాలన సాధ్యమేనా? శాఖలన్నీ తరలిపోవడం ఖాయమేనా? అమరావతి నుంచి విశాఖకు మకాం మార్చేందుకు శాఖాధిపతులు సిద్ధమేనా? ప్రభుత్వం ప్లేస్ ఆఫ్ వర్క్ నోటిఫై చేయకుండా శాఖల్ని తరలించడం సాధ్యమేనా? కొందరు ఐఏఎస్లను ఇప్పుడీ సందేహాలు తొలుస్తున్నాయి. నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే కొందరు అధికారులు గట్టిగా ప్రశ్నించారని తెలుస్తోంది.
అమరావతి నుంచి విశాఖకు శాఖల కార్యాలయాలను తరలించాలని వైసీపీ ప్రభుత్వం హడావుడి చేస్తుంటే అధికారులు కీలక సందేహాలు లేవెనెత్తుతున్నారు. ప్లేస్ ఆఫ్ వర్క్‌ను మార్చేందుకు సరైన ఉత్తర్వులు ఇవ్వకుండా విశాఖకు ఎలా వెళ్లగలమని కొందరు సీనియర్ ఐఏఎస్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని గట్టిగానే అడిగినట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి, ప్రభుత్వ శాఖలకు, ఉన్నతాధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది కీలకమైన అంశంగా ఉంటుందని, దీనిని ఎలా పడితే అలా వినియోగించుకోడానికి నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
ప్రభుత్వం ప్లేస్ ఆఫ్ వర్క్‌ను నోటిఫై చేయకుండా ప్రభుత్వ శాఖలను తరలించేస్తే తాము అక్కడికి రాబోమని, కొందరు ఐఏఎస్లు సీఎస్కు తేల్చి చెప్పేసినట్టు తెలుస్తోంది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ లాంటి సీనియర్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు నివేదిక ఇవ్వటమే తప్పని ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారు. ఇది నేరుగా సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించటంతో పాటు ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారులు అధికారిక పనుల నిమిత్తం ఢిల్లీకో, పొరుగు రాష్ట్రాలకో, విదేశాలకో వెళ్లాలన్నా సదరు అధికారి పర్యటనకు సంబంధించిన ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సిందే. అలాంటిది విశాఖకు పాలనను తరలించేందుకు వీలుగా, అక్కడ శాఖల క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలంటూ, సీనియర్ అధికారుల నేతృత్వంలోని కమిటీ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా ఉత్తర్వులు జారీ చేయటంపైనా విస్మయం వ్యక్తం అవుతోంది.
ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశిస్తే ఆయా తేదీల్లో మాత్రమే తాము వస్తామని, పూర్తిగా అక్కడికి తరలివచ్చేందుకు సాధ్యం కాదని ఐఏఎస్లు చెప్పినట్లు సమాచారం. మరోవైపు విశాఖలోని విమ్స్‌లో అధికారులకు క్యాంపు కార్యాలయాలు, విడిది ఏర్పాటుకు వీలుందంటూ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపైనా అభ్యంతరం వ్యక్తం అవుతోంది. జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం విమ్స్ ప్రాంగణాన్ని ఇతర అవసరాలకు వినియోగించేందుకు ఆస్కారంలేదని తెలుస్తోంది.