- కోవిడ్ తర్వాత తొలిసారిగా నిర్వహణ
- కేఎల్ వర్సిటీలో మూడు రోజులపాటు
- స్పెషలిస్టులతో ప్రత్యేక కార్యక్రమాలు
విజయవాడ: ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్యులు ఎంతో వీరోచితంగా కృషి చేశారని అప్సకాన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. ఎం. రవీంద్రనాథ్ అన్నారు. విజయవాడలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్స్ ఆఫ్ సీమాంధ్ర ప్రతినిధులు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కోవిడ్‌పై పోరాటంలో ఊపిరితిత్తుల వైద్యులు(పల్మనాలజిస్టులు) కీలక పాత్ర పోషించాని వివరించారు. కోవిడ్ సమయంలో రెండేళ్లు ఎలాంటి సదస్సులు నిర్వహించలేకపోయామన్నారు. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి పల్మనాలజిస్టులందరితో రాష్ట్రస్థాయి వార్షిక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని వివరించారు. అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్స్ ఆఫ్ సీమాంధ్ర అనే బ్యానర్ మీద అప్సకాన్- 2022 ఆధ్వర్యంలో ‘అన్ వీలింగ్ న్యూ హారిజాన్స్ ఆఫ్ పల్మనాలజీ’ పేరుతో సదస్సు జరుగుతుందని డా. ఎం. రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సదస్సులో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్లో కొత్తగా వస్తున్న అంశాల గురించి చర్చించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పల్మనాలజిస్టులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సు విజయవాడ సమీపంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో మూడు రోజులపాటు జరుగుతుందన్నారు. మొదటి రోజు పోస్టు గ్రాడ్యుయేట్స్‌కు వివిధ అంశాలపై వర్క్ షాపు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా ఇంటర్ వెన్షన్ పల్మనాలజీ, క్రిటికల్ కేర్ తదితరాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలపై వర్క్ షాపు ఉంటుందని వివరించారు. తర్వాతి రెండు రోజులు సైంటిఫిక్ ప్రోగ్రామ్ అందులో దేశం నలుమూలల నుంచి జాతీయ స్థాయిలో నిష్ణాతులైన వైద్య నిపుణులు, పల్మనాలజిస్టులు పాల్గొని, వివిధ అంశాలపై లెక్చర్స్ ఇస్తారని వివరించారు. దేశంలోని ప్రముఖ స్పెషలిస్టుల ద్వారా డా. చక్రపాణి మెమోరియల్ ఒరేషన్, డా. కోటిలింగం ఎండోమెంట్ ఒరేషన్ ఇస్తారన్నారు. విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్, అకడమిక్ కెరీర్లో కావాల్సిన అబ్ స్ట్రాక్ట్స్, పోస్టర్ ప్రజంటేషన్స్ తదితరాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశంగా అన్ని జాగ్రత్తలతో జరుపుతున్నామని, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నామని రవీంద్రనాథ్ కోరారు.
ఈ సందర్భంగా అన్ని విధాలుగా సహకరించి, ప్రోత్సహిస్తున్న కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సును ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డా. శ్యాంప్రసాద్, ప్రారంభిస్తారని, అలాగే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. ఎం. రాఘవేంద్రరావు, కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్స్‌లర్ డా. జీపీఎస్ వర్మ, ఆంధ్రా హాస్పిటల్ ఎండీ డా. పీవీ రమణ మూర్తి, ఊపిరితిత్తుల వైద్యంలో స్పెషలిస్టు నందిగామ ఎమ్మెల్యే డా. ఎం. జగన్మోహనరావు చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని డా. ఎం. రవీంద్రనాథ్ వివరించారు. విలేకరుల సమావేశంలో అప్సా అధ్యక్షులు డా. జి. బాబూరావు, ప్రతినిధులు డా. కె. అనిల్ కుమార్, డా. ఎంవీ సుబ్బారావు, డా. ఎంఎస్ గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.