• మంత్రులు సవిత, డోల బాలవీరాంజనేయుల స్వామి, ఫరూక్ భేటీ
• హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపై చర్చ
• నాణ్యమైన భోజనం, ఆరోగ్య భద్రతతో కూడిన విద్యే లక్ష్యం
• ప్రత్యేక బృందాలతో హాస్టళ్ల నిరంతర పర్యవేక్షణ : మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెనూ అమలు, హాస్టళ్లలో పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు సాంకేతిక విద్య పకడ్బందీగా అందించేలా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంత్రులు సవిత, డోలా బాల వీరాంజనేయుల స్వామి, ఎన్ఎండీ ఫరూక్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపై చర్చించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారంతో పాటు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు సవిత, డోలా బాల వీరాంజనేయుల స్వామి, ఎన్ఎండీ ఫరూక్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
విద్యార్థులకు గత ప్రభుత్వం పెట్టిన డైట్ బకాయిలు, కాస్మొటిక్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించిందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల కడుపు నింపేలా సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. హాస్టళ్లలో పారదర్శకతకు పెద్డపీట వేస్తూ విద్యార్థులకు, వార్డెన్లకు, ఇతర సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ పెట్టామన్నారు. హాస్టళ్లలో రుచికరమై భోజనం తయారీకి కుక్, కమాటీ పోస్టులు భర్తీ చేశామన్నారు. త్వరలో బీసీ హాస్టళ్లలో పారిశుద్ధ్యం అమలు కోసం సిబ్బందిని నియమించనున్నామన్నారు. సాంకేతి విద్య కోసం గురుకులాల్లో కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హాస్టళ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధులు కూడా అందజేస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాల బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల తనిఖీకి ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ బృందాలు తరుచూ హాస్టళ్లను సందర్శించి, పనితీరు మెరుగుకు కృషి చేస్తాయని మంత్రి సవిత వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయా సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.