-అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు
-‘పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష
తాడేపల్లి: పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పులివెందుల ప్రాంతంలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పాడా అభివృద్ధి పనులపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పులివెందులలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.
►జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్‌పై 41వ కిలోమీటరు వద్ద మొగమేరు అక్విడెట్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే పైడిపాలెం, కుమ్మరంపల్లె గ్రామాలకు చెందిన 535 కుటుంబాల ముంపు బాధితులకు పరిహారం మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు.
►పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, పులివెందుల సిటీ సెంటర్ పనులపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పులివెందుల జగనన్న హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణ ప్రగతిని అధికారులు వివరించగా, నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
►వాటర్‌గ్రిడ్ పనుల పురోగతితోపాటు పులివెందుల మెడికల్ కళాశాల, యూజీడీ, వాటర్ సప్లయ్, బస్టాండు నిర్మాణం తదితర అంశాలపై పనుల పురోగతి గురించి అధికారులు వివరించారు. దీంతోపాటు వేంపల్లె యూజీడీ, డిగ్రీ కళాశాల, గండి ఆలయ అభివృద్ధి పనులు, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ పనుల పురోగతిని సైతం అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
►ఖరీఫ్, రబీ రెండు సీజన్ల అరటిసాగుకు ఈ–క్రాప్ బుకింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
►మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యలపై సమావేశంలో చర్చించారు.
►కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థికశాఖ కార్యదర్శులు సత్యనారాయణ, గుల్జార్, ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.