భువనగిరి: ఆధ్యాత్మిక చింతన అనిర్వచనీయమైన ప్రశాంతతనివ్వడంతో పాటు, మనిషిని సన్మార్గం వైపు నడిపిస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లె లోని రమణేశ్వరం మహాక్షేత్రంలోని శివశక్తి షిర్డీసాయి అనుగ్రహ మహాపీఠంలో 1023 పంచలోహ శ్రీచక్రాల మహాఆలయమును మంత్రి కొండా సురేఖ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంత్రి సురేఖ పాల్గొన్నారు.
ఆలయ ఆవిష్కరణ అనంతరం ఆలయంలో కొలువైన 9 అడుగుల శ్రీచక్రంతో పాటు, 1023 శ్రీచక్రాలను మంత్రి సురేఖ దర్శించుకున్నారు. మహాశివుని ఆలయంలోని బంగారు శివలింగానికి మంత్రి సురేఖ, కుటుంబ సభ్యులు అభిషేకం నిర్వహించారు.
అనంతరం భూప్రస్తార, కైలాసప్రస్తార మేరు ప్రస్తార ఆలయం, పంచలోహ శ్రీ కామేశ్వర కామేశ్వరి ఆలయం, పాలరాతి పెద్దమ్మవారిని, నవదుర్గలను, దశభైరవులు, దశ మాతృకలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
100 రోజుల అతిస్వల్ప సమయంలో అత్యంత వైభవోపేతంగా 1023 పంచలోహ శ్రీచక్రాలను ప్రతిష్టించడం అభినందనీయమని సిద్ధగురు రమణానంద మహర్షి కృషిని మంత్రి సురేఖ ప్రశంసించారు.