– సికింద్రాబాద్‌లో పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం
– 15 రోజుల పాటు 30 మైదానాల్లో క్రీడా పోటీలు
– 35 వేల మంది క్రీడాకారుల నమోదు
హైదరాబాద్ :ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్–2025–26 ప్రారంభోత్సవం సోమవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ క్రీడా మహోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా భారత బ్యాడ్మింటన్ జట్టు కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపియన్ సైనా నెహ్వాల్, భారత మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, దృష్టి కేసరి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 15 రోజుల పాటు 30 మైదానాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, అథ్లెటిక్స్‌తో పాటు పలు ఇతర క్రీడల్లో పోటీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అన్ని డివిజన్ల స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జూనియర్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బస్తీల్లోని మహిళల కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహిస్తున్నామని, మీడియా ప్రతినిధుల కోసం కూడా ప్రత్యేక క్రీడా ఈవెంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది తొలిసారిగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు విశేషంగా రాణిస్తున్నారని, భవిష్యత్తులో కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల్లో సుమారు 35 వేల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని, అందరూ తమ ప్రతిభను చాటుకుని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులు, నిర్వాహకులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.