అహో ఆంద్రభోజా..
శ్రీకృష్ణదేవరాయా…
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా..
ఈ శిధిలాలలో
చిరంజీవివైనావయా…
భరత భూమిలో
పురాణ పురుషులతో
సమఖ్యాతి…జగద్విఖ్యాతి..
భోజునకు సాటి..
ఘనాపాటి..సాహితీమేటి..
రాయలంటే నిజంగా రోయలే!
తెలుగదేలయన్న..
తెలుగదేలయన్న..
నేను తెలుగు వల్లభుండ
అని గర్వంగా చెప్పుకున్న సార్వభౌముడు..
విజయనగరమంటే
కళలకు కాణాచి…
రాయలే ఆ ఘనతకు విరించి..
అందుకే ఆయనను
అఖండ కీర్తి వరించి..
ఆ చక్రవర్తి ఉనికితోనే
తెలుగు నేల తరించి..!
రాయల వారి కథ చెబితే
ముందుగా విజయాల విజయనగరం..
ఆయన పేషీ..
కళాకృతుల నగిషీ..
తిరుమలమ్మ పట్టమహిషి..
వ్యూహాల ఉరుసు తిమ్మరుసు..
సకల కళలను పోషించిన
భలేవాడివి బాసు..!
ఘనమైన శ్రీకృష్ణ ఆస్థానం..
రాయలవారి
హృదయోల్లాస స్థానం..
ఆయన సాహితీ ప్రస్థానం
భువనవిజయం..
అష్టదిగ్గజాల నిజస్థానం..!
అచ్చోట ఎన్ని ఉత్తరప్రత్యుత్తరాలో..
అన్నీ రసవత్తరాలే..
అల్లసాని వారి జిగిబిగి..
రామకృష్ణ కవి గజిబిజి..
వీరి చర్చల నడుమ
రాయల వారెప్పుడూ బిజీబిజీ!
కవులంటే ఆయనకు
ఎంత మర్యాద…
ఆయన స్వయంగా ఆముక్తమాల్యద..!
కత్తులును..ఘంటములు
కదనుతొక్కినవచట..
అంగళ్ల రతనాలు
అమ్మినారట అచట..
నాటి రాయల పేరును నేటికిని
తలపోయు తుంగభద్ర నది..
దానికి తెలియదా
రాయల వారి మది..
అది అఖండ
కళాభిమాన జలధి..
ఎన్నోతరాల
తెలుగుదనాల వారధి..
అంతరాలు ఎరుగని మహానది
ఇన్ని విశేష గుణాల
రాయలు అయినాడు
తెలుగుదనానికి సారధి..
ఎన్నెన్నో పోరాటవిజయాల మహారధి..!
మొత్తంగా కళాపోషణ
రాయల సర్వం..
ఆయన మనవాడు కావడం
మన గర్వం..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286