– ప్రధాని మహీంద్రా రాజపక్సే రాజీనామా
– రివాల్వర్‌తో కాల్చుకున్నఎంపీ అమరకీర్తి అతుకొరాల
– మంత్రులు, ఎంపీల ఇళ్ళతో పాటు రాజపక్సే కుటుంబీకులకు చెందిన పూర్వీకుల ఇళ్ళ దహనం
– కట్టలు తెంచుకొన్న ప్రజాగ్రహం
శ్రీలంక చరిత్రలో తొలిసారిగా జరిగిన తిరుగుబాటు చివరకు దేశ ప్రధాని ఇంటినే తగులబెట్టే పతాక స్థాయికి చేరింది. ఆయన రాజీనామా చేసినా ప్రజల ఆగ్రహం చల్లారకపోగా, ఆయన పూర్వీకుల ఇళ్లను కూడా
దహనం చేసిన ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ప్రధాని మహీంద్రా రాజపక్సే రాజీనామా చేసినా జనంలో ఆగ్రహం చల్లారలేదు. మంత్రులు, ఎంపీల ఇళ్ళతో పాటు రాజపక్సే కుటుంబీకులకు చెందిన పూర్వీకుల ఇళ్ళను కూడా జనం తగుల బెట్టారు. కురునగలలో ఉన్న మహీంద్రా రాజపక్సే ఇంటికి నిప్పు పెట్టడంతో … మొత్తం ఇల్లు దగ్ధమైంది. నిరసనకారులపై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు,నేతలు దాడులు చేయడంతో జనం తిరగబడుతున్నారు.
ఈ ఘర్షణల కారణంగా అధికార పార్టీకి చెందిన అమరకీర్తి అతుకొరాల ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను వెళుతున్న వాహనంపైకి ఆందోళన కారులు రావడంతో ఎంపీ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో సమీపంలోని ఓ ఇంటిలోకి వెళ్ళిన ఎంపీ, అక్కడే తనను తాను రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ భవనం చుట్టూ వందలాది మంది ఆందోళకారులు ఉన్నట్లు తెలుస్తోంది.