అలా ధారాపరిగ్రహంబు చేసి
ఇంతింతై వటుడింతై
తానింతై.. నభోవీధిపైనింతై
తోయది మండలాగ్రమున
కల్లంతై..ప్రభారాసి పైనంతై..
చంద్రుని కంతయై..
ధృవుని పైనంతై..
మహర్వాటి పైనంతై..
బ్రహ్మాండాంత సంవర్ధియై..
మూడడుగుల భూమి ఇచ్చిన పుణ్యానికి
బలి కనుగొన్న.
ముక్కోటి దేవతలు కలగన్న
మహాకృతి..అభివర్ణిస్తూ
ఇదిగో పోతన కృతి..!
బలిని బలి చేయక
అతడి కీర్తిని ద్విగుణీకృతం
చేస్తూ మూడడుగుల నేలను స్వీకరించి తాను దిగంతాలకు ఎదిగిన బడుగు బాపడు..
కారణజన్ముడు..
దుష్టశిక్షణార్థం హరి తానుగా దాల్చిన అయిదో అవతారం..
దానమిచ్చిన బలి కొంగుబంగారం..!
అయినా..ఈ బాపడు
బడుగై కనిపించాడేమో గాని
జన్మతః మహారూపుడే…
శంఖుచక్రగదాకమలకలిత
చతుర్భుజుడై..
బిసంగ వర్ణవస్త్రధారియై..
మకరకుండలమండిత
గండభాగుడై…
శ్రీవిరాజితలోలంబ
కదంబవనమాలిగా..
సకల అలంకారాలతో..
నిఖిలజన
మనోహరుడై పుట్టి
ఎప్పటికే వేషము అవసరమో
అప్పటికది అన్నట్టు
బడుగు బాపడై చేరినాడు
బలి చక్రవర్తి కొలువు..
అలరించే చిరునగవు!
మాట ఇచ్చిన బలి
మూడడుగుల భూమి దానమీయబోగా
నివారించిన శుక్రుని
ఏకాక్షిగ చేస్తే..
పుట్టి నేర్చుకొనెనో..
పుట్టక నేర్చెనో..
ఈ పొట్టివడుగునకీ
చిట్టిబుద్దులెట్లబ్బెనో..!
ఇలా బలే అచ్చెరువొందేలా
ఇంతింతై వటుడింతై
ఎదిగితే ఈ బుడుగు బడుగు
అప్పుడే ఉదయించిన భానుడు ముందు
తానే గొడుగై..
తదుపరి శిరోరత్నమై..
ఇంకాస్త పెరిగాక
చెవి కుండలమై..
మెడలోని ఆభరణమై..
బంగారు కేయూరమై..
కంకణమై..
వడ్డాణపు ఘంటమై
నూపురప్రవరమై..
చివరకు ఆ తేజస్వి
ఈ తేజస్సుకు దాసోహమై..
పాదపీఠమై తాను
చిరయశస్సునొందె..!
ఒక్కో అవతారానికి_
ఒక్కో అంతరార్థం..
బలి మోక్షార్థం..
శుక్రునికి అందని
గూడార్థం..
దేవతలకే అర్థం కాని
బ్రహ్మపదార్థం..
బ్రహ్మాండానికే అధిపత
అయిన హరికి
మూడడుగుల నేలనిచ్చి..
దానంలోని మర్మాన్ని_
లోకానికి సెలవిచ్చిన
బలి జన్మ అలా చరితార్థం!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286