– ‘శ్రీవాణి ట్రస్టు’పై బీజేపీ వర్సెస్ జనసేన
– వీర్రాజు మెడకు జనసేన ఉచ్చు
– శ్రీవాణి ట్రస్టు వివాదంలో టీటీడీకి బీజేపీ వకాల్తా
– అవకవతల్లేవంటూ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి కితాబు
– టీటీడీని వెనకేసుకొచ్చిన బీజేపీ నేతభానురెడ్డి
– శ్రీవాణి ట్రస్టుకు 1100 కోట్లకు పైగా నిధులొచ్చాయన్న భానురెడ్డి
– 800 కోట్లు మాత్రమే వచ్చాయన్న వైవి సుబ్బారెడ్డి
– చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పిన దానికంటే 300 కోట్లు ఎక్కువే చెప్పిన భాను
– ఆ 300 కోట్లు ఎక్కడికి వెళ్లాయంటున్న జనసేన నేత కిరణ్ రాయల్
– ఎంపిక చేసిన వారికే లెక్కల తనిఖీలపై విమర్శలు
– అన్ని పార్టీలకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్
– ఇప్పటిదాకా ఆరోపణలను ఖండించని మంత్రులు
– అవకతవకలపై గళం విప్పిన పవన్
– విచారణకు పవన్ కల్యాణ్ డిమాండ్
– శ్వేతపత్రం కోరిన టీడీపీ
– భానుపై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్
– లేకపోతే అది వీర్రాజు అభిప్రాయంగా భావించాలని స్పష్టీకరణ
– భానుది వ్యక్తిగత అభిప్రాయమా? బీజేపీ స్టాండా అని నిలదీసిన కిరణ్
– భానుపై చర్యలకు వీర్రాజు వెనుకడుగు
– చర్య తీసుకోకపోతే జనసేనకు ఆగ్రహం
– భానురెడ్డిపై చర్యలు తీసుకోవాలంటున్న బీజేపీ సీనియర్లు
– లేకపోతే జనసేనతో సంబంధాలు చెడిపోతాయని ఆందోళన
– ఢిల్లీ నాయకత్వం దృష్టికి భానురెడ్డి వ్యాఖ్యలు
– వీర్రాజు.. కిం కర్తవ్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. బీజేపీ తిరుపతి నేత- రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మెడకు చుట్టుకుంటున్న వైచిత్రి. టీటీడీ దర్శనాల కోసం నిర్వహిస్తున్న శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి ఇటీవలి కాలంలో, అనేక ఆరోపణలు
వెల్లువెత్తుతున్నాయి. రశీదు కూడా ఇవ్వడం లేదని, మిగిలిన డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయంటూ విపక్షాలు శరపరంరగా విరుచుకు పడుతున్నాయి. దానితో రంగంలోకి దిగిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి.. శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకవకలు జరగలేదని ఖండించారు.
అప్పటికీ నమ్మకం లేక.. కొంతమంది మఠాధిపతులు, కొందరు ప్రముఖులతో ప్రకటనలు ఇప్పించారు. శ్రీవాణి ట్రస్టు లెక్కలు తాము పరిశీలించామని, అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వారంతా మూకుమ్మడిగా తీర్పులిచ్చారు. ఆవిధంగా లెక్కల తనిఖీకి ఎంపిక చేసుకున్న కొంతమందిని మాత్రమే అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దానితో అన్ని పార్టీలకూ.. లెక్కలు తనిఖీ చేసే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది.
ఈ నేపథ్యంలో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి, శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే దానిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ.. శ్రీవాణి ట్రస్టుపై అనేక ఆరోపణలు సంధించింది. రశీదు ఎందుకివ్వడం లేదని నిలదీసింది. ఆ డబ్బులు ఎటు వెళుతున్నాయని ప్రశ్నించింది. శ్రీవాణి ట్రస్టు లెక్కలపై, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకువేసి.. ట్రస్టు లెక్కలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి, వారి ఆరోపణలు ఖండించడం, టీటీడీ కూడా శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటనలివ్వడం చకాచకా జరిగిపోయింది. అయితే.. ప్రభుత్వంపై విపక్షాలు చేసే ఆరోపణలను, శరవేగంగా ఖండించే మంత్రులు.. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన ఆరోపణలు మాత్రం ఖండించకపోవడమే ఆశ్చర్యం.
కాగా.. ఈ మొత్తం వ్యవహారంలో, తిరుపతికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి రంగంలోకి దిగి ప్రదర్శించిన అత్యుత్సాహంతో, కథ కొత్త మలుపు తిరిగింది. సహజంగా విపక్షాలు ప్రభుత్వంలో జరిగే అవినీతిని ఎండగట్టేందుకే ప్రాధాన్యం ఇస్తాయి. ఎక్కడ అవకాశం వస్తుందా అని, సందర్భం కోసం నేతలు ఎదురుచూస్తారు. అలాంటి సందర్భం-సంఘటన వెలుగుచూస్తే, సర్కారును విపక్షపార్టీలు దునుమాడతాయి. ఇది ఎక్కడైనా, ఎప్పుడైనా జరిగేదే.
అయితే అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడిన.. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, తన పార్టీ
అధ్యక్షుడు సోము వీర్రాజును రాజకీయంగా ఇరికించిన వైనం, ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. స్వయంగా భానురెడ్డి చేసిన ప్రకటన, రాజకీయంగా అటు బీజేపీని కూడా సంకట పరిస్థితిలోకి నెట్టివేసింది.
ఇప్పటికే వైసీపీ సర్కారుతో బీజేపీ అంటకాగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో.. భానురెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ ఆరోపణలు నిజం చేసేలా అనిపించడమే బీజేపీ ఇరకాటానికి అసలు కారణం. హిందుత్వం- హిందూ ఆలయాలపై దాడులపై గళం విప్పే బీజేపీ నేతలే.. ఈవిధంగా ఆలయంలోని ట్రస్టుపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ, టీటీడీకి వకాల్తా పుచ్చుకోవడంపై పార్టీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగడం లే దన్నది భానురెడ్డి వాదన. ఆ మేరకు తాను ఈఓ కార్యాలయానికి వెళ్లి పరిశీలించానని, అక్కడ అవకతవకలు జరిగినట్లు తనకు కనిపించలేదని స్పష్టం చేశారు. అనవసరమైత ఆరోపణలు చేయవద్దని ఆయన కోరడం, బీజేపీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
శ్రీవాణి ట్రస్టు లెక్కలు తనిఖీ చేయమని, పార్టీ నాయకత్వం ఏమైనా భానురెడ్డిని అధికారికంగా పంపిందా? పంపితే ఆ మేరకు అనుమతి కోరుతూ ఈఓకు ఏమైనా లేఖ రాసిందా? రాస్తే ఆ లేఖ రాసింది ఎవరు? అలాగైతే అన్ని పార్టీలకూ లెక్కల తనిఖీలకు అనుమతి ఇస్తారా? లేక బీజేపీకి మాత్రమే అది పరిమితమా? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఓవైపు మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీవాణి ట్రస్టులో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తే, తాము మాత్రం అలాంటిదేమీ లేదని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారంటే .. అది పవన్‌ను అవమానించడమే కదా? అని బీజేపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ అడిగిన ప్రశ్నలకు తమ వద్ద జవాబు లేదని బీజేపీ సీనియర్లు వాపోతున్నారు.
‘‘శ్రీవాణి ట్రస్టులో అవకతవకలు లేవన్న భానుప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన సొంతవా? పార్టీ స్టాండా? దీనిపై సోము వీర్రాజు స్పందించకపోతే, ఇవి సోము వీర్రాజు అనుమతితో చేసిన వ్యాఖ్యలుగానే
భావిస్తామని’’ కిరణ్ స్పష్టం చేశారు. దీనితో జనసేనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, బీజేపీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.
పైగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన లెక్కల్లో.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి- బీజేపీ నేత భానురెడ్డి చేసిన ప్రకటనల మధ్య పొంతన లేకపోగా, 300 కోట్లు తేడా కనిపించడం మరో వివాదానికి తెరలేపినట్లయింది. ట్రస్టుకు 800 కోట్ల నిధులు వచ్చాయని చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. కానీ బీజేపీ నేత భానురెడ్డి మాత్రం 1100 కోట్లు వచ్చాయని వెల్లడించడమే ఆ గందరగోళానికి కారణం. ట్రస్టు లెక్కలను సమర్ధించిన భానురెడ్డి చెప్పినట్లు.. మిగిలిన ఆ 300 కోట్ల రూపాయలు ఏమయ్యాయని జనసేన ఇన్చార్జి కిరణ్‌రాయల్ డిమాండ్ చేశారు.
ఈ ఈ అంశంలో ఆయన భానుప్రకాష్‌రెడ్డిపై విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. ‘అసలు టీటీడీ తరఫున మాట్లాడేందుకు భానురెడ్డి ఎవరు? ఆయనేమైనా చైర్మన్ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి అధికార ప్రతినిధా? టీటీడీ ఈఓ మమ్మల్ని కూడా భానురెడ్డి మాదిరిగానే అనుమతించి, లెక్కలు చూపాలి. అధికారులు భానురెడ్డికి ఏం చూపించారో, ఆయనేం చూశారో మేము కూడా పరిశీలిస్తాం. పవన్ కల్యాణ్ పెదవి విప్పిన తర్వాత సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్ధం కావడం లేదు. హిందుత్వం, గుళ్లపై ఎక్కువగా మాట్లాడే బీజేపీ, శ్రీవాణి అవకతవలను సమర్థించిన భానురెడ్డిపై చర్యలు తీసుకోవాలి’’ అని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
కాగా భానురెడ్డి వ్యవహారశైలి.. మొత్తం పార్టీని ఇరికించడంతో, పార్టీ వర్గాలు సంకటస్థితిలో ఉన్నాయి. ప్రధానంగా ఇది అధ్యక్షుడు సోము వీర్రాజుకు, ప్రాణసంకటంలా పరిణమించింది. వీర్రాజు అనుమతి లేనిదే భానురెడ్డి ఎందుకు మాట్లాడతారని అటు జనేసైనికులు ప్రశ్నిస్తుంటే.. ఇలాంటి సున్నిత అంశంపై మాట్లాడేందుకు వీర్రాజు పార్టీ నేత భానురెడ్డికి ఎలా అనుమతి ఇచ్చారో అర్ధం కావడం లేదని బీజేపీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
‘ఇది రెండు పార్టీలకు సంబంధించిన సున్నిత అంశం. పైగా జనసేన ఇంకా మాతో పొత్తులోనే ఉంది. రెండురోజుల క్రితమే మా అధ్యక్షుడు, తాము జనసేనతో మాత్రమే కలసి పోటీ చేస్తామని మీడియాకు చెప్పారు. అలాంటిది శ్రీవాణి ట్రస్టుపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారని తెలిసి కూడా భానురెడ్డి, ఆయన వ్యాఖ్యలకు విరుద్ధంగా టీటీడీని సమర్థించడం పొత్తు ధర్మం కాదు. ఇది చాలా దూరం వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. అందువల్ల భానురెడ్డిపై చర్యలు తీసుకుంటేనే, ఈ సమస్య ఇక్కడితో ముగుస్తుంది. లేకపోతే పవన్ అభిప్రాయాలను ఖండించిన మేం, ఆయనతో ఎలా మనస్ఫూర్తిగా నడవగలం’ అని తూర్పు గోదావరికి చెందిన ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.
భాను వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు వీర్రాజు, స్వయంగా వివరణ ఇస్తే స్పష్టత వస్తుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా పవన్ వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడిన భాను ప్రకటన, యూట్యూబ్ లింక్, ఆంగ్ల మీడియాలో వచ్చిన క్లిప్పింగులను ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీకి పంపినట్లు సమాచారం.