Suryaa.co.in

డిసెంబరు 8న శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె
Andhra Pradesh

డిసెంబరు 8న శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 8వ తేదీ బుధ‌వారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 4.30 గంటల వరకు పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారు. ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలవుతుంది. గజాలపై ఈ సారెను ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు ఉద‌యం 6 గంట‌ల‌కు తీసుకొస్తారు.
అలిపిరి నుంచి బ‌య‌లుదేరి ఉదయం 9 గంట‌ల‌కు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి సారె చేరుతుంది. ఉదయం 10 గంటలకు వాహ‌న మండ‌పంలో స్నపన తిరుమంజనం మొదలవుతుంది. ఉద‌యం 11.52 నుండి మధ్యాహ్నం 12 గంటల మ‌ధ్య ఏకాంతంగా వాహ‌న మండ‌పంలో పంచమితీర్థం చక్రస్నానం నిర్వహిస్తారు.

LEAVE A RESPONSE