Suryaa.co.in

National

తమిళనాడులో ముదిరిన త్రిభాషా వివాదం

– హిందీ రూపీ ‘₹’సింబల్‌ తిరస్కరించిన స్టాలిన్
-వెంటనే బీజేపీ కౌంటర్
(వాసు)

హిందీని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతున్నారనే విషయంపై పోరాడుతున్న తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిందీ అక్షరంతో ఉన్న రూపీ సింబల్‌ను తరిస్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఆ రాష్ట్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కాపీల్లో రూపీ సింబల్‌కు బదులు తమిళంలో రూ అని రాశారు. కొత్త విద్యా విధానంలో మూడు భాషల ప్రతిపాదనపై తమిళనాడు అభ్యంతరం చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే కుట్ర జరుగుతోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు.

తమిళనాడు బడ్జెట్ 2025-26ను ఈరోజు సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీని కంటే ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాష్ట్ర ఆర్థిక నివేదిక విడుదల చేశారు. అందులో రూపాయి చిహ్నం (₹) స్థానంలో భారత కరెన్సీని సూచించే తమిళ భాషా చిహ్నం ఉంది. అయితే, గతంలో తమిళనాడు బడ్జెట్ పత్రాలలో ‘₹’ చిహ్నాన్ని ఉంచేవారు.

“అందరికీ అన్నీ” అనే శీర్షికతో సీఎం ఈ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ అన్ని విషయాల్లో సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేలా దీన్ని విడుదలచేశారు. తమిళ సాంస్కృతిక గుర్తింపు, భాషా గర్వాన్ని తిరిగి పొందేలా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

సింబల్ మారుస్తున్న సంకేతాలు స్టాలిన్ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే తమిళనాడు బిజెపి చీఫ్ అన్నామలై రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌X లో కామెంట్స్ పోస్టు చేశారు. “తమిళ వ్యక్తి రూపొందించిన రూపాయి చిహ్నాన్ని డిఎంకె ప్రభుత్వ 2025-26 సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో తీసేసింది. దీనిని భారతదేశం మొత్తం స్వీకరించింది. మన కరెన్సీలో పెట్టారు. ఈ చిహ్నాన్ని రూపొందించిన తిరు ఉదయ్ కుమార్, మాజీ డిఎంకె ఎమ్మెల్యే కుమారుడు. మీరు ఇంకా ఎంత మూర్ఖంగా తయారవుతారు?” అని విమర్శించారు.

LEAVE A RESPONSE