Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అక్షరాల 10 లక్షల 57 వేల కోట్ల రూపాయలు

-నేను చెప్పిన అప్పుల లెక్కలు తప్పంటే… జగన్ ఆయన వంది మాగాదులు కాదని నిరూపించాలి
-నేను అడిగిన ప్రశ్న వేరు… కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం వేరు
-అబద్ధం చెప్పలేదు కానీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రస్తావించిన అప్పులను మాత్రమే చెప్పారు
-చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఏడాదికి 50 వేల కోట్లు
-ప్రతినెలా 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన దుస్థితిలో రాష్ట్రం
-గత ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేసిన జమోరె… నాలుగున్నర ఏళ్లలో తాను చేసిన అప్పులపై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయడం లేదు
-వాలంటీర్ చేసిన హత్యను కప్పిపుచ్చేందుకు సాక్షి దినపత్రిక ప్రయత్నం
-కొంపలో కుర్రాడు… ప్రజల్లో పెద్దాయన
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అక్షరాల పది లక్షల 57 వేల కోట్ల రూపాయలు. ఈ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిందే. ప్రతి నెల 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెట్టిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు మండి పడ్డారు .
పార్లమెంటులో రాష్ట్ర అప్పుల వివరాల గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను నేను అడిగిన ప్రశ్న వేరు… ఆమె చెప్పిన సమాధానం వేరు. కేంద్ర ఆర్థిక మంత్రి అబద్ధం చెప్పకపోయినప్పటికీ, అసలు విషయాన్ని మాత్రం చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ అసలు అప్పు ఎంతో నేను చెప్పాను … ఇది తప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన వందిమాగాదులు భావిస్తే లెక్కలతో రావాలని సవాల్ విసిరారు.

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం చేసిన వెధవ అప్పుల వివరాలన్నీ నాకు తెలుసు. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి మించి ఇంత దారుణంగా ఎలా అప్పులు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఏడాది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి 30 వేల కోట్ల రూపాయల కాగా , ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 29 వేల రెండు వందల కోట్ల రూపాయల అప్పులను చేసింది. ఇక మిగిలింది కేవలం 750 కోట్ల రూపాయలు మాత్రమే.

అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3, 000 కోట్ల రూపాయల అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఏ ప్రాతిపదిక రాష్ట్రానికి మూడు వేల కోట్ల రూపాయల అప్పులు ఇవ్వనున్నారో అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవాలనుకుంటే ఏ రాష్ట్రానికి ఎంత అప్పైనా ఇస్తారా?, బిజెపి పాలిత రాష్ట్రాలకు కూడా అదనంగా అప్పులు ఇవ్వడం లేదు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 10 కోట్ల రూపాయల అప్పు తీసుకుందని కేంద్ర ప్రభుత్వం కాల్చుకు తింటోంది. జగన్మోహన్ రెడ్డి ఏ మాయ చేస్తున్నారో తెలియదు. అడ్డగోలుగా అప్పులను చేస్తున్నారు.

ఈ ఆటలు ఎక్కువ రోజులు సాగవు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కలిసి రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వివరాలన్నీ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను వివరించడానికి ఇప్పటికే నేను రెండు సార్లు కాగ్ అధికారులను కలిశాను. మూడుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సోమనాథన్ ను కలిశాను. మళ్లీ త్వరలోనే కలుస్తానని రఘురామకృష్ణం రాజు చెప్పారు.

ఆదాయం పెరిగితే అప్పులు ఎందుకు?
ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి పెంపు కోసమని రాష్ట్ర జీఎస్ డిపి పెరిగినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపించింది. జి ఎస్ డి పి పెరిగినప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది కదా?!. మరి అప్పులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?? అని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. 20 14 లో రాష్ట్ర జి ఎస్ డి పి 5 లక్షల కోట్ల రూపాయల చిల్లర ఉండగా 2019 వరకు అది క్రమేణ పెరుగుతూ వచ్చింది . జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కష్టకాలంలోనే రాష్ట్ర జిఎస్ డిపి పెరిగినట్లుగా, ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి పెంపు కోసం తప్పుడు లెక్కలను చూపించారు.

ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉంటాయి. తమకున్న అధికారాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ, జి ఎస్ డి పి ని పెరిగినట్లుగా తప్పుడు లెక్కలను చూపించి , ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి మించి అప్పులు చేస్తోంది . కార్పొరేషన్ల పేరిట చేస్తున్న అప్పుల గురించి తెలియనివ్వడం లేదు. కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దొంగ అప్పుల గురించి నేను కేంద్ర ప్రభుత్వానికి పదే, పదే లేఖలు రాస్తూనే ఉన్నాను . నేను రాసిన లేఖలపై స్పందించిన కేంద్రం, కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పుల వివరాలను వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది.

కేంద్ర ప్రభుత్వం, అప్పుల వివరాలను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖల కాపీలు నాకు అందాయి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పుల వివరాలను మాత్రం కేంద్రానికి వెల్లడించిన లేఖల కాపీలు నాకు అందలేదు. అంటే కేంద్రం అడిగినప్పటికీ కూడా కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదని స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దొంగ అప్పులపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పోరాడుతున్నారు. ఈ నిజాలు త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్పుల కనికట్టుకు ఆయన బ్రేక్ వేస్తారని ఆశిస్తున్నానని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.

జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలివిగో…
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బిఐ బాండ్ల ద్వారా 2.38 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాబార్డు ద్వారా 5,992 కోట్ల ప్రత్యేక రుణాన్ని పొందింది. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లకు గ్యారెంటీ ఇచ్చి 97,603 కోట్ల రూపాయల రుణాలను, కార్పొరేషన్లను తాకట్టు పెట్టడం ద్వారా 94, 928 కోట్ల రూపాయల అప్పులను పొందింది.

నేషనల్ సెక్యూరిటీ ఫండ్ ద్వారా 8,945 కోట్ల రూపాయలు, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక బోగస్ కంపెనీని స్థాపించి పదివేల కోట్ల రూపాయల అప్పులు చేసింది. సివిల్ సప్లై కార్పోరేషన్ పేరిట 35 వేల కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్లకు, సప్లై దారులకు ఇవ్వాల్సినది 71, 500 కోట్లు, ఉద్యోగులకు స్టాచ్యూరిటీగా చెల్లించాల్సింది 33,110 కోట్ల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగుల డిపాజిట్లు లాగి వేసి 11,170 కోట్ల రూపాయలు, పబ్లిక్ అకౌంట్స్ నుంచి అడ్డంగా దోచుకున్నది 26, 850 కోట్ల రూపాయలు, పంచాయితీల సొమ్మును 8,868 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తస్కరించింది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 6,94, 731 కోట్ల రూపాయల అప్పులు చేయగా, గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల తో పాటు, రాష్ట్ర ఆవిర్భావం నుంచి చేసిన అప్పులు అక్షరాల 10 లక్షల 57 వేల కోట్ల రూపాయలని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

అప్పు చేసిన డబ్బు ఏమి చేస్తున్నారు?
అప్పుల రూపేణా ఎత్తుతోన్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోంది. లిక్కర్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రానికి రావలసిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు. ఇప్పటికే 13 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరో 13 ఏళ్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేస్తుందేమో?!. మనల్ని మన భవిష్యత్తుని తాకట్టు పెట్టి చేస్తున్న అప్పుల ద్వారా వచ్చిన డబ్బంతా ఏమీ చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

అప్పు చేసి పప్పు కూడు అన్నట్లుగా సాగుతోన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉందని, తక్కువ అప్పులు చేసి కూడా ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఆదాయాన్ని ఇస్తున్నారని గొప్పలు చెప్పుకునే ప్రయత్నాన్ని ఆయన అనుకూల మీడియా చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఏపీ ఎస్ డి సి ) పేరిట చేసిన అప్పు ఎంత?, ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పోరేషన్ పేరిట చేసిన అప్పులు , రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని తాకట్టు పెట్టి కాదా??, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని దారి మళ్లించి, భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హాం ఫట్ చేసింది. ఈ అప్పులు తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలది కాదా?, రాష్ట్ర ప్రజలకు అంత మాత్రం అవగాహన లేదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా?, సాక్షి దినపత్రిక వంటి చెత్త పేపర్లో రాసిందే ప్రజలు నమ్మేస్తారా?

మాకు ఎవరికీ బుద్ధి జ్ఞానం, బుర్ర లేదని అనుకుంటున్నారా?, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, దొంగ అప్పుల వివరాలను ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించి చెబుతున్నారు. నేను రోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు చెబుతూనే ఉన్నాను. ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన వందిమాగాదులు చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మే రోజులు పోయాయి.

2019 జూలై 10వ తేదీన గత ప్రభుత్వం 3.62 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని శ్వేత పత్రం రూపంలో వివరాలను వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి, ఈ నాలుగున్నర ఏళ్లలో చేసిన అప్పులు ఎన్నో ఎందుకనీ శ్వేత పత్రం విడుదల చేయడం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి మేధావులు ఎందుకు ప్రశ్నించడం లేదు. ఈ అప్పులన్నీ కలిపి ఎంతో చెప్పమని పార్లమెంటులో నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించాను. దీనికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1.77 లక్షల కోట్ల రూపాయలుగా ఆమె పేర్కొన్నారు.

అంతకుమించి అప్పులు ఉంటే కట్టాల్సిన అవసరం లేదని, నిర్మలా సీతారామన్ నుంచి ఒక సర్టిఫికెట్ తెచ్చుకోండి. నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా చెప్పిన సమాధానంపై కింగ్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని పేరడీగా చూపిస్తూ, సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. రాజుగారు అడిగిన ప్రశ్న ఏమిటి?, నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం ఏమిటి?? అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు .

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రస్తావించిన అప్పుల గురించి మాత్రమే నిర్మలా సీతారామన్ చెప్పారు. కానీ నేను అడిగిన ప్రశ్న వేరు… ఆమె ఇచ్చిన సమాధానం వేరు. నిర్మలా సీతారామన్ అబద్ధాన్ని మాత్రం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుల వివరాలు వెల్లడించాలని నేను కోరాను. కార్పొరేషన్ల పేరిట చేసిన దొంగ అప్పుల గురించి అడిగాను. ఈ అప్పుల ద్వారా రాష్ట్ర ప్రజలపై పడే భారం ఎంత అని ప్రశ్నించాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, అడగని ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం చెప్పారు.

పార్లమెంట్లో నాకు అనుబంధ ప్రశ్న అడిగే అవకాశం ఉండి ఉంటే, నేను మళ్ళీ ప్రశ్నించే వాడిని. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సాక్షి దినపత్రిక తీవ్ర ప్రయత్నమే చేసింది. అప్పుడే గుదిబండ అనే శీర్షికతో సాక్షి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించిన వార్త కథనాన్ని రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శిస్తూ, తాము చేస్తున్న అప్పులను కవరింగ్ చేసుకునే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందన్నారు .

తాము తప్పు చేస్తున్నామని తెలుసు కాబట్టే, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కవరింగ్ కోసం ప్రయత్నాలను చేస్తున్నారు. నేను వేసిన ప్రశ్నలపై స్పీకర్ కార్యాలయం స్పందిస్తూ ప్రాంతీయ సమస్యలు కాకుండా, జాతీయ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రశ్నించాలని ఒక మేఘ సందేశాన్ని పంపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయంలో పార్లమెంటరీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వారిని మా పార్టీ నాయకులు మేనేజ్ చేశారేమోనన్న అనుమానం కలుగుతోందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

హత్య చేసిన వాలంటీర్ ఉద్యోగం నుంచి తొలగించారట…
వాల్తేరు లో వరలక్ష్మీ అనే మహిళను వెంకటేష్ అనే వాలంటీర్ హత్య చేసిన సంఘటనను అన్ని దినపత్రికలు కవర్ చేయగా, సాక్షి దినపత్రిక మాత్రం అందరికీ భిన్నంగా వార్తా కథనాన్ని ప్రచురించింది. నగల కోసం ఓ మహిళ హత్య అన్న శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించి వెంకటేష్ అనే వ్యక్తి గతంలో వాలంటీర్ గా పనిచేసేవాడని పేర్కొంది. అతని పనితీరు బాగా లేకపోవడంతో జూలై 27వ తేదీన విధుల్లో నుంచి అతన్ని తొలగించారట.

30వ తేదీన వాలంటీర్ ఒక మహిళను హత్య చేస్తే, అంతకు మూడు రోజుల ముందే అతన్ని విధుల్లో నుంచి తొలగించామని చెప్పడం హాస్యాస్పదం. సాక్షి దినపత్రిక ఎన్ని కథనాలు రాసిన మహిళను వాలంటీర్ చేసిన హత్య, హత్య కాకుండా పోతుందా?, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో తప్పులు జరుగుతున్నాయని తెలిసే, ఈ విధంగా వార్త కథనాల ద్వారా కవరింగ్ చేసుకోవడానికి ప్రయత్నాన్ని చేస్తున్నారు.

74 ఏళ్ల మహిళ వృద్ధురాలిపై లైంగిక ఆరోపణలు చేయడం దారుణం. మీ ఇంట్లో పొరపాటున రంకు ఉంటే, దేశంలోని అందరికీ రంకు కట్టేస్తారా?, వావి వరుసలు అన్నవి లేవా??, అసలు మానవత్వం అన్నది ఉన్నదా?, 74 ఏళ్ల మహిళా వృద్ధురాలు పై సోషల్ మీడియాలో ఈ విధంగా రాతలు రాస్తున్న వారికి, రాయిస్తున్నవారి మోహన ప్రజలు కాండ్రించి ఉమ్మేయాలని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్న పెద్దాయన
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టులను ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో ఒక ఉపాధ్యాయుడి తరహాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత, ఈ ప్రభుత్వం చేస్తోన్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగడుతున్నారు. చంద్రబాబు నాయుడు ని ముసలివాడని ఎద్దేవా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలు వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో కూర్చున్నారని, అదే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను వింటున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఎలాగో రోడ్లపై తిరగలేరు. ఎందుకంటే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వరదల కారణంగా తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గతం లో చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించేవారు.

కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టడం లేదు. తమిళ భాష లో ఇటీవల విడుదలైన నాయకుడు చిత్రంలో జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఆ చిత్రంలోని కథ నాయకుడిని ప్రతి నాయకుడు ఊరులో అడుగుపెట్టనివ్వకపోతే నేను రచ్చబండ కార్యక్రమం ద్వారా టీవీని మాధ్యమంగా చేసుకుని ప్రజలకు చేరువైనట్టే, ఆ చిత్రం లో కథానాయకుడి పాత్రదారి ప్రజలకు చేరువై ప్రతి నాయకుడి ఆట కట్టిస్తాడు.

విశాఖ పార్లమెంటు సభ్యుడు నన్ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన సంఘటనను స్పీకర్ తో పాటు, ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాను. ప్రధానమంత్రి స్పందించి నా లేఖ అందినట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని ఆయన కార్యాలయం ద్వారా పంపించారు. స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు స్పందించలేదు. స్పందిస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE