Suryaa.co.in

Andhra Pradesh

మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ లీగ్

-క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్తేజాన్ని నింపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-బ్రాహ్మణ సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ నగరం అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ లీగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. గౌరవ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ,డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు. గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలలో 24 జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్తేజాన్ని నింపారు. గత 8 ఏళ్లుగా రాష్ట్రస్థాయిలో ఇటువంటి పోటీలు ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటువంటి పోటీలు క్రీడాస్పూర్ఫిని పెంపొందించడంతో పాటు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో రాణించే వారిని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా ఎదిగి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తారని అన్నారు. అదేవిధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్లాది విష్ణు  అన్నారు. ఇందులో భాగంగా వంశపారంపర్య అర్చకత్వంపై జీవో కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దేవాలయాలలో పనిచేసే అర్చకులకు 25శాతం అదనంగా జీతాన్ని పెంచామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ వ్యవస్థను పటిష్ట పరిచారని చెప్పుకొచ్చారు. మరీముఖ్యంగా క్రెడిట్ సొసైటీ బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతిలో కీలక భూమిక పోషిస్తోందని వివరించారు. క్రెడిట్ సొసైటి అనేది బ్రాహ్మణుల బ్యాంకు అని.. కరోనా విపత్తు సమయంలో పేద బ్రాహ్మణులకు సొసైటీ ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరిగిందన్నారు. అరుంధతి, పురోహిత మిత్ర పథకాల ద్వారా అర్హత కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు రుణాలు అందచేస్తున్నట్టు వివరించారు.

డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా దాగి ఉండే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినపుడే వారు క్రీడల్లో రాణించగలుగుతారని అన్నారు. క్రీడలతో పోటీతత్వం, సృజనాత్మకత అలవడుతుందన్నారు. మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. క్రీడాకారులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ సీఈవో నాగసాయి, కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, గాయత్రి సొసైటీ సభ్యులు డాక్టర్ ఈశ్వర్, చల్లా హరికుమార్, దూబగుంట శ్రీనివాస్, జె.కె.సుబ్బారావు, కె.డి.పి.ఏ. సెక్రటరీ ఏ.శ్రీధర్, బ్రాహ్మణ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు లంకా బాబు, చల్లా సుధాకర్, చాంద్ శర్మ, కోలవెన్ను కొండ, మూర్తి, చోడవరపు శివ, ప్రఖ్యా శివ, క్రీడాకారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE