– దేవాదాయ శాఖ మంత్రి ఆనం
అమరావతి : శ్రీశైలం దేవస్థానంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను వేగంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు.
శుక్రవారం సచివాలయంలో మంత్రి రామనారాయణ రెడ్డిని శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు (బీఎస్ఆర్), ఆనిల్ కుమార్, పిచ్చయ్య మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానంలో లావాదేవీలు పారదర్శకంగా, వేగంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయడం అత్యవసరం అని సభ్యులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వివరించారు. దీనితో భక్తుల రద్దీ తగ్గడమే కాకుండా సేవల నాణ్యత పెరుగుతుందని వారు తెలిపారు.
బోర్డు సభ్యుల వినతిని మంత్రి రామనారాయణ రెడ్డి సానుకూలంగా స్వీకరించి, డిజిటల్ పేమెంట్స్ అమలుకు అవసరమైన చర్యలను త్వరితగతిన ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభ్యులకు హామీ ఇచ్చారని, బోర్డు తరఫున తమ ప్రతినిధిత్వాన్ని వినయపూర్వకంగా అందజేశామని ధర్మకర్తల బోర్డు సభ్యులు మీడియాకు తెలిపారు.