– పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల రాజకీయాల శకం ముగిసింది
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల సమస్యలను ప్రజల మధ్య చర్చకు తీసుకురావాలి. ప్రజల మద్దతును సమీకరించి, ప్రజలకు మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి, అవసరమైతే పోరాటాలకు శ్రీకారం చుట్టాలి. కానీ ఈరోజు కేటీఆర్ రాజకీయ విధానం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కేటీఆర్ ప్రజాక్షేత్రాన్ని వదిలేసి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయికి రావాలని స్వయంగా వారి కుటుంబ సభ్యురాలైన కవిత చెప్పిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అయినా కేటీఆర్ లో ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
నేను బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే, కేటీఆర్ అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంగా ఆగమేఘాలపై రాష్ట్రస్థాయి భారీ సభ పెట్టారు. అయినప్పటికీ ఆ రోజు ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది పూర్తిగా తన బలాన్ని నిరూపించుకునే బలప్రదర్శన సభగా మాత్రమే మిగిలిపోయింది.
ఆ సభకు వచ్చిన వారిలో చాలామంది యువతీ యువకులు, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన నా సోదర సోదరిమణులే. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ ఒక్కరోజు కూడా క్షేత్రంలో ప్రచారం చేయలేదు. ఎలాంటి సహాయం, సహకారం అందించలేదు. ఇది బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూపిస్తుంది.
దీనికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చింది. ఒకసారి పార్టీ మారిన తర్వాత కట్టుబాటుతో, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే గౌరవాన్ని బీజేపీ అందిస్తుంది.
అందుకే ‘డబుల్ ఇంజన్ సర్కార్’ విధానంతో కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగుతోంది. 20కు పైగా రాష్ట్రాలలో ప్రజల ఆశీర్వాదాలతో బీజేపీ అధికారంలో ఉంది.
కేటీఆర్ బీజేపీకి రెండు స్థానాలే వచ్చాయని వెటకారంగా మాట్లాడుతున్నారు. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది స్థానాలు ఎలా వచ్చాయో ఆయన గుర్తుంచుకోవాలి. అది ప్రజల తీర్పు. అది ఎడ్డిమారి గుడ్డి దెబ్బ కాదు. ప్రజల స్పష్టమైన మద్దతు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేసినా, పాలమూరు వంటి ప్రాంతాల్లో బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. బల్మూరు వంటి ప్రాంతాలు ఎప్పటికీ బీజేపీకి కంచుకోటలే. గతంలోనూ, ఇప్పుడూ అక్కడ బీజేపీ అభ్యర్థులే గెలిచారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల రాజకీయాల శకం ముగిసింది. ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడే నాయకత్వమే ఇప్పుడు అవసరం. కృష్ణా–గోదావరి జలాలపై చర్చ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేసే విధంగా జరిగే కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. అలాగే బీఆర్ఎస్కు కూడా మాట్లాడే నైతిక హక్కు లేదు.
నేను ఒక పాలమూరు వలస కూలీ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత ఆత్మపరిశీలన చేసుకొని, దేశానికి కావాల్సిన నాయకత్వం నరేంద్ర మోదీ దే అని నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరాను. అప్పటి నుంచి నేటి వరకు పార్టీని బలపరచడం కోసం నిరంతరం పనిచేస్తున్నాను. కేటీఆర్ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రయాణం రెండు స్థానాలతోనే మొదలైంది.
అదే పార్టీ మూడోసారి దేశాన్ని పాలిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వెకిలి వ్యాఖ్యలు, సోషల్ మీడియా కామెంట్లు, డబ్బు ర్యాలీలతో ప్రజలను మభ్యపెట్టలేవు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే ప్రజల మధ్య నిలబడింది, నిలబడుతుంది. ఎంత కుట్రలు చేసినా కాషాయ జెండా మళ్లీ ప్రజాక్షేత్రంలో ఎగరడం ఖాయం.