ఆ నవయువకుడు తనది కాని దేశంలో ఉద్యోగం చేయడానికి కడుపు చేతితో హోపట్టుకుని వచ్చాడు.
కావేరి, గోదావరి నదుల దగ్గర ఉద్యోగం చేశాడు. ధవళేశ్వరంలో ఉద్యోగ నిమిత్తం కాపురం ఉన్నాడు.
ఓసారి ఆతని ఇంటిలో పనిచేసే ఆమె ఓ పదిరోజులు పనిలోకి రాలేదు. పదకొండో రోజున పనిలోకి వచ్చిన పనిమనిషిని ఆతని భార్య నిలదీసింది ‘పనిలోకి ఇన్ని రోజులనుంచి ఎందుకు రాలేదని?’
అంతే..!
ఆ పనిమనిషి భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆ దొరసాని పనిమనిషిని ఓదార్చి వివరం కనుక్కుంది. ఆరోజులలో గోదారి సీమ అంతా కరువు కాటకాలతో తల్లడిల్లిపోతోంది. కడుపుకింత అన్నం కూడ లేదు. గోదారి ఒండ్రు మట్టిని కూసింత గంజిలో కలుపుకుని అదే అమృతంగా ఇంటిల్లిపాదీ రోజూ తాగి కడుపు నింపుకునే వారు. బతుకు కొనసాగించేవారు.
అలాంటి వేళలో ఎవరో కాస్త కలిగిన మహానుభావులు ఆ పనిమనిషి సంతానమైన ఆడపిల్లను కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆతల్లి ముందు- వెనుకలాలోచించకుండా తన సంతానాన్ని అమ్మేసింది! డబ్బుకోసం కాదు!!
తనెలాగూ తన బిడ్డను పోషించలేదు. కాస్త కలిగిన చోట పడితే కనీసం అదన్నా బతుకుతుందని!!!
ఆ చేతిలో పడ్డ కాసులతో మిగతా కుటుంబం కాలం వెళ్ళదీయచ్చునని!
అమ్మడమంటే అమ్మేసింది కాని అమ్మ మనసును గట్టిపరుచుకోవడానికి సమయం పట్టింది. అందుకే పనిలోకి రాలేకపోయింది. ఇదంతా దొరసానికి భోరున విన్నవించుకుంది.
ఆ తర్వాత ఆ దొరసానికి రెండు రాత్రుళ్ళు కంటికి నిద్ర లేదు. నోటికి ముద్ద పోలేదు. భర్తేమో ఊళ్ళో లేడు.
భర్త రాగానే ఈ విషయాన్నంతటినీ వివరించింది. “మీరు ఇంజనీర్ కదా…
ఇంతటి గోదావరి మహానది ప్రవహిస్తున్నా ఇక్కడి ప్రజానీకాన్ని ఇలాంటి దుర్గతి నుండి తప్పించలేరా”అని నిలదీసింది.
ఆ దొర గారు అప్పుడు ఆలోచించారు.
ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. గోదారి నీళ్ళను బీడు భూములలోనికి ప్రవహింప చేయాలనుకున్నాడు. పంటలు పండించి అందరి కడుపు నింపాలనుకున్నాడు.
వెంటనే ప్రభుత్వానికి మహజరు పంపాడు. ఎన్నో తిప్పలు పడి విదేశీ ప్రభుత్వాన్ని ఒప్పించాడు.
కానీ ఇప్పుడొచ్చింది అసలు సమస్య!!
మహోధృతంగా ఉత్తుంగ తరంగంగా ప్రవహించే గోదావరి నదికి తాను అడ్డుకట్ట వేయగలడా!?
దైవప్రేరేపణ కాకుంటే అసలు తనకా ఆలోచన ఎందుకు వచ్చింది? అని తర్కించుకున్నాడు!
వెంటనే ఓ మెరుపు మెరిసింది!!
తాను కావేరీ నదీ పరీవాహాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆనదిపై 900 సంవత్సరాల క్రితమే ‘రాజరాజ చోళుడు’ ఇసుకతో ఆనకట్టను నిర్మించిన ఘట్టం గుర్తుకొచ్చింది. తాను మాత్రం ఆవిధంగా ఎందుకు చేయకూడదు?అనుకుని తన మిత్రుడు అయిన ‘వీరం వీణెన్న’ను వెంటబెట్టుకుని రంగంలోకి దిగిపోయాడు. గోదావరి సీమ అణువణువూ గాలించేశాడు. గోదారమ్మ పాయలుగా చీలుతున్న ‘ధవళేశ్వరం- ర్యాలి’ గ్రామాల మధ్యన ఆనకట్ట కట్టేడు.
కోట్లాది మంది కడుపులు నింపాడు. శతాబ్దాలకు, సహస్రాబ్దాలకు సరిపడే సంపద కూర్చి పెట్టేడు!!!!!!
ఆ దొర గారే… సర్.ఆర్ధర్.కాటన్…..!
అంత కష్టపడ్డందుకు ఆయనకు కలిగిన ఫలితం…
ఆయన ఆనకట్ట పనిమీద దూరంగా ఉన్నప్పుడు ఆయన ముద్దుల కూతురు ఆయన లేకుండానే తుది శ్వాస విడిచింది..!
ఆ పాప సమాధి ధవళేశ్వరంలో ఉంది.
ఆనకట్ట కట్టిన తరువాత ఆయన దాని పర్యవేక్షణలో కోనసీమలో తిరుగుతుండగా ఓ అగ్రహారంలో ఓ ఉదయాన్న ఓ పండితుడు “కాటన్ మహాశయం తన్నమమ” అంటూ సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తుండగా చూశాడు.
వెంటనే డఫేదారుని అలా ఎందుకంటున్నాడో కనుక్కు రమ్మని పంపేడు.
“ఇక్కడ ఇంత గోదారి ఉన్నా మాకు మన్నేగాని అన్నమేనాడూ లేదు. కాటన్ దొరగారి పుణ్యమా అని మాకందరకూ అన్నపానాలకు, సిరిసంపదలకూ లోటులేకుండా బ్రతుకు గడిచిపోతోంది. ఆయనే మా ప్రత్యక్ష దైవం! అందుకే మా సూర్యునితో పాటుగా ఆయనకూ అర్ఘ్యమిస్తున్నాను” అని అన్నాడట ఆ ఘనాపాటి.
“ఇంతకన్నా నాకింకేం కావాలి?!”
అని తన జీవితచరిత్రలో వ్రాసుకున్న అల్పసంతోషి సర్.ఆర్ధర్ కాటన్.
ఆ ప్రత్యక్ష దైవానికి ఈ గోదావరి వరదల సందర్భంగా మా రైతులందరి పక్షాన….
అనేకానేక కృతజ్ఞతాంజలులు”.పుష్పాంజలులు