– కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై నిందలు ఆపండి
– బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాశ్ రెడ్డి
విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పరిశీలిస్తామన్న హామీ మాత్రమే ఉంది. 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డేయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రధాన డిమాండ్ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై కమిటీని నియమించింది. బయ్యారం సమీపంలోని ప్రాంతాలను పరిశీలించిన కమిటీ.. ఇక్కడి ఇనుప ఖనిజంతో ఉక్కు తయారీ లాభసాటి కాదని తేల్చింది.
అంతేకాదు స్టీల్ ధరలన్నీ అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడిన తరుణంలో నష్టాలతో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని నడపడం సాధ్యంకాదన్నారు. అయినా ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నారు. నిర్మాణం విషయంలో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. కాగా, బయ్యారం నిర్మాణం విషయంలో మాటిమాటికీ కేంద్ర పర్యాటక సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఆడిపోసుకోవడం తప్ప ఇంకోటి లేదు. తెలంగాణ ఉద్యమంలో లేని ఈ మంత్రులు తెలంగాణ కోసం పోరాటం చేసిన కిషన్ రెడ్డిని తప్పు పట్టడం అంటే నవ్వు తెప్పిస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో పువ్వాడ అజయ్, మాలోతు కవిత, నామా నాగేశ్వరరావు పాత్ర ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలియదనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. బయ్యారం కోసం టీఆర్ ఎస్ పార్టీ ఒక్కరోజు దీక్ష చేపట్టడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. బయ్యారం ఉక్కు కోసం గత ఏడేండ్లుగా టీఆర్ ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది తప్ప మార్గాలను అన్వేషించడం లేదు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పై నిందలు మోపుతున్నది.
‘కేంద్రం గీంద్రం జాంతానై .. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ జేపిచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తా’అని ఐదేండ్లు అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ, కేసీఆర్ చేసిందేం లేదు. మరోవైపు 2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కేంద్ర సహకారం లేకుండానే సింగరేణి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర వనరులతోనే ప్రారంభం చేసుకుంటామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి.
చేతకాని దద్దమ్మలు, అసమర్థులు ఎదుటివారిపై దాడి చేసి ఆత్మసంతృప్తి చెందుతారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా సింగరేణి, టీఎస్ ఎండీసీ తెలంగాణ ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతుందని మంత్రి హోదాలో కేటీఆర్ మాట్లాడిన విషయం వాస్తవం కాదా..? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పిన విషయం మరిచిపోయారా..? తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్లాంట్ ఏర్పాటు చేసి 15వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేటీఆర్ వాగ్దానం ఎక్కడికి పోయింది.
కేంద్రంపై నిందలు వేయడం.. కేంద్రాన్ని బద్నాం చేయడంలో టీఆర్ ఎస్ తీరు జుగుస్సను కలిగిస్తోంది. బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్తున్న కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో లేని తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిపై పరుష పదజాలం వాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వాస్తవాలను ప్రజలకు వివరించండి. వాగ్దానం తప్పిన కేసీఆర్ ఫాం హౌస్ వద్ద, కేటీఆర్ పేషీలోనో దీక్ష చేసి వాగ్దానం నిలుపుకోవాలని పట్టుబట్టాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి డిమాండ్ చేస్తోంది.