– భూములమ్మిన బీఆర్‌ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటు
– బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: గత రెండు వారాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మాలని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ భూముల్లో ఎన్నో వనరులు ఉన్నాయి. ప్రకృతికి హాని చేసేలా భూములను విక్రయించొద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
హెచ్‌సీయూ భూముల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వ భూమిని అమ్ముతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ భూమి అయినప్పటికీ, ప్రకృతికి నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. గ్రీన్ స్పేస్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి.
అవసరమైన చోట పార్కులు అభివృద్ధి చేయాలి. లేదంటే స్కూళ్లు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌కు లంగ్ స్పేస్‌గా తీర్చిదిద్దాలి. అయితే, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం కాంక్రీట్ జంగిల్‌గా మార్చాలనుకోవడం సరికాదు. భూముల అమ్మకంతో తరతరాలకు చెందిన గ్రీన్ స్పేస్ నశించిపోతుంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులు, హైదరాబాద్ ప్రజల హితం దృష్టిలో ఉంచుకుని పునఃసమీక్షించాలి.
రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ భూములను విక్రయించాలని యత్నించడం అనైతికం. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా విలువైన భూములను విక్రయించింది. రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతాల్లో వందల ఎకరాల విలువైన భూములు అమ్మారు. ఇప్పుడు అదే బీఆర్‌ఎస్ నేతలు ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది.
భూముల అమ్మకానికి వ్యతిరేకంగా బిజెపి నిజమైన పోరాటం చేస్తోంది. ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు లాయర్లతో కూడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్‌ను యూనివర్సిటీకి పంపించనున్నారు.