-మోడీ ఆరాధన ఇకనైనా మానండి
-ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి పట్టవా?
-వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఎందుకు సందర్శించలేదు?
-పరిపాలనా వైఫల్యంతోనే ఇంత నష్టం
-తక్షణం వరద ప్రాంతాలను జగన్ రెడ్డి సందర్శించాలి
-నెలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వాలి
-సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడం అన్యాయం
-రాష్ట్ర వ్యాప్తంగా 21న శాంతియుత ధర్నా కార్యక్రమాలు
-22న జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలు
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్
విజయవాడ : సీఎం సీటు కోసమే ఆరాటం తప్ప ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పట్టవా అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్యెల్యేలు తాడేపల్లి ప్యాలస్ నుంచి ఆజ్ఞ రానిదే రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛగా పర్యటించే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనా వైఫల్యంతోనే ఇంత నష్టం జరిగిందని, ప్రధాని నరేంద్ర మోడీ ఆరాధన ఇకనైనా మానుకుని తక్షణం వరద ప్రాంతాలను జగన్ రెడ్డి సందర్శించాలని డిమాండ్ చేశారు. వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఎందుకు సందర్శించలేదని శైలజనాథ్ ప్రశ్నించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించామని సాకే శైలజానాథ్ తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసమే పని చేస్తున్నారని, ప్రజల కోసం పని చేయటం లేదని విమర్శించారు. ఇది ప్రకృతి వైపరీత్యమని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్లాస్టిక్ డేరాల కింద జనాలు నివసిస్తున్నారని, ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి రూ. 25 వేలు, నిత్యవసర సరుకులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కేంద్రం నుంచి పోలవరం నిధులు వస్తేనే పోలవరం పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెపుతుందని, పోలవరంలో ముంపు ప్రాంతాలలో తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని శైలజానాథ్ కోరారు. పరిహారం కింద జగన్మోహన్ రెడ్డి రూ. ఆరు లక్షల కాదు..పది లక్షలు ఇస్తామన్నారని, తక్షణమే రూ. 10 లక్షలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21 తేదీన సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడం అన్యాయమన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా 21న శాంతియుత ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు. 22న జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలు చేపడతామని వెల్లడించారు. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులతో ఇబ్బంది పెట్టడం, అది రాజకీయ కక్షేనని, ఇటు వంటి రాజకీయ కక్షలకు పాల్పడేవారికి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని శైలజానాథ్ అన్నారు.