– పోలీసులా? వైసీపీ కార్యకర్తలా?
-మాతో పెట్టుకుంటే వైసీపీ ఎలా గెలుస్తుందో మేమూ చూస్తాం
– మేనమామ కాదు.. కంస-హింస మామ
– లోకేష్-రామకృష్ణ ఎదుట అనంత విద్యార్ధుల ఆక్రోశం
– సర్కారుపై విద్యార్ధుల రణనినాదం
అనంతపురం: జగన్ సర్కారు తీసుకున్న ఎయిడెడ్ పాఠశాలల స్వాధీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పిడికిలి బిగించిన విద్యార్ధులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని, విద్యార్ధిలోకం విరుచుకుపడింది. ‘‘మా పాఠశాలను రక్షించమని మా స్కూల్లో నిరసన చేస్తున్న మాపై పోలీసులు గొడ్డును బాదినట్లు బాదడం మానవత్వమా? పైశాచికత్వమా? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఫ్యూడల్ దేశంలో బతుకుతున్నామా? మేమేమన్నా గంజాయి అమ్ముతున్నామా? ఈ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. బాలికలపై మగ పోలీసులు చేయిచేసుకోవడం అమానవీయం’’ అని విద్యార్ధి లోకం వైసీపీ సర్కారుపై రణనినాదం చేసింది. మేం ఎక్కడికీ వెళ్లం. ఇక్కడే ఉంటాం. పేదలయిన మాకు ఫీజులెవరు కడతారు? జగన్ కడతారా? ఎడ్యకేషన్ మనిష్టర్ కడతారా? అని బాలికలు నిలదీశారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమక్షంలో అనంతపురం ఎస్ఎస్బీఎన్ విద్యార్ధులు.. తమపై పోలీసుల పైశాచికత్వాన్ని ఆవేదనతో వినిపించారు. వారి పోరాటానికి మద్దతునిచ్చిన లోకేష్.. మీరు చేసే పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మేనమామగా ఉంటానన్న జగన్‌రెడ్డి హింసమామ-కంసమామగా మారారని లోకేష్ విరుచుకుపడ్డారు. అనంతపురం కాలేజీకి వెళ్లిన లోకేష్‌కు విద్యార్ధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్ధులు పోలీసు లాఠీచార్జి సందర్భంగా తమ అనుభవం-ఆవేశాన్ని వినిపించారు. అవన్నీ వారి మాటల్లోనే..
లాఠీ ఛార్జ్ చేసి విచక్షణారహితంగా కొట్టారు: పవన్
శాంతియుతంగా మా హక్కుల కోసం పోరాడుతుంటే పోలీసులు మా కాలేజ్ లోకి చొరబడి మా పై దాడి చేశారు.ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ చెయ్యడం వల్ల పేద విద్యార్థులు నష్టపోతారు.మా కాలేజ్ లో చదువుకొని ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు.మా కాలేజ్ ప్రైవేటీకరణ కాకుండా పోరాడతాం. పోలీసులు మాపై లాఠీ ఛార్జ్ చేసి విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులకు కూడా పిల్లలు ఉంటారు.మా సమస్యను అర్థం చేసుకోండి.ఎయిడెడ్ కాలేజ్ లను రక్షించుకుంటే ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు. జరుగుతుంది.
మేము ప్రశ్నిస్తే విద్యాశాఖ మంత్రి పారిపోయారు: . వంశీ
ఇప్పటికైనా విద్యార్థి లోకం మేల్కోవాలి.మనం నోరు మెదపకపోతే మనకి ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ఉండదు. పోలీసులు దాడి చెయ్యలేదు అంటున్నారు. ఎంత ఘోరంగా కొట్టారో వీడియోల్లో అందరూ చూశారు.పిల్లలు ఇంత ఆందోళనలో ఉంటే విద్యా శాఖ మంత్రి ఎం చేస్తున్నారు. మేము ప్రశ్నిస్తే విద్యా శాఖ మంత్రి పారిపోయారు. సీఎం గారు.. యూత్ తో పెట్టుకోకండి మాకు న్యాయం చెయ్యండి.
మేనమామ ఎక్కడ? : వంశీ
జగన్ మామ వస్తాడన్నారు. ఇప్పుడు మా బడి మూసేస్తున్నారు.మా అమ్మా, నాన్న కూలికి పోయి వేలకు వేలు ఫీజులు ఎలా కట్టాలి?మేనమామ ఎక్కడ?కనీసం విద్యార్థుల పై దాడిని ఖండించలేదు? మా కాలేజ్ లో మేము నిరసన తెలిపితే పోలీసులు ఎందుకు వచ్చారు?
ఇప్పటికిప్పుడు బయటకి పొమ్మంటే ఎక్కడికి పోవాలి? మీకు అధికారం ఉందని విద్యార్థుల తలలు పగలగోడతారా?
వైసీపీ ఎలా గెలుస్తుందో మేమూ చూస్తాం: చైతన్య
72 ఏళ్లుగా ఉన్న కాలేజ్ ని ప్రైవేటీకరణ చేస్తాం అంటే ఎలా ఊరుకుంటాం. పేద విద్యార్థులకు ఉచిత విద్య అన్నారు జగన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? మన కాలేజ్ కోసం మనం పోరాడుతున్నాం. మాతో పెట్టుకుంటే వైసీపీ ఎలా గెలుస్తుందో మేమూ చూస్తాం.
మీ చెల్లికి కూడా జరిగితే ఇలానే స్పందిస్తారా :సాయి
ఫీజు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల మేము చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మేము మర్డర్లు, దొంగతనాలు చెయ్యలేదు. మా కాలేజ్ కోసం పోరాడితే లాఠీ ఛార్జ్ చేశారు.విద్యార్థుల తల్లిదండ్రులు…కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నాం
ప్రైవేటీకరణ చేస్తే ఫీజులు ఎలా కడతాం? అక్కమ్మలు, చెల్లెమ్మలు అన్నారు ఇప్పుడు మాతో ఆడుకుంటున్నారు. జయలక్ష్మి ని కొట్టినట్టే మీ చెల్లికి కూడా జరిగితే ఇలానే స్పందిస్తారా ముఖ్యమంత్రి గారు.?
ఇప్పుడు పోవాలి జగన్ అంటున్నాం : ఏఐఎస్ఎఫ్ నేత వేణు
2019 లో రావాలి జగన్ అన్నాం. ఇప్పుడు పోవాలి జగన్ అంటున్నాం. ప్రైవేటీకరణ వద్దు…ఎయిడెడ్ కొనసాగించండి.ఎయిడెడ్ ని ప్రైవేటీకరణ చేసి విద్యను వ్యాపారం చెయ్యొద్దు.ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ని కాపాడండి. జగన్ విధానాలను తిప్పికొట్టడానికి అన్ని జిల్లాల్లో విద్యార్థులకు అండగా ఉద్యమాలు చేస్తాం.
పోలీసులు వైసీపీ నేతల్లా పనిచేస్తున్నారు : ఏఐఎస్ఎఫ్ నేత మనోహర్
కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము విద్యార్థుల తరపున పోరాడతాం. పోలీసులు వైసీపీ నేతల్లా పనిచేస్తున్నారు.