మక్కువ/పార్వతీపురం: ప్రతి విద్యార్ది ప్రభుత్వ బడుల్లోనే చదువుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు నియోజకవర్గం మక్కువ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నేను కూడా ప్రభుత్వ బడిలోనే చేసువుకున్నానని అన్నారు.
సొంత ఊరులోనే చదువుకోవడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాలకు అవసరమైన ఆర్ఒ ప్లాంట్, కాంపౌండ్ వాల్, భవన మరమ్మతులు చేయాలని విద్యార్దులు తెలిపగా విడతల వారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మన స్కూల్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమాకురుస్తానని తెలిపారు.
ప్రభుత్వ బడుల్లో ర్యాంకుల శాతం పెరిగిందని, ఇక్కడ చదివిన విద్యార్డులు డాక్టర్, ఇంజనీర్,ఎన్ఐటి, ఐఐఐటిలలో సీట్లు సాధిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ బడుల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు విశాలంగా ఉంటాయని,ప్రవేట్ బడుల్లో ఇరుకు గదుల్లో చదువుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందని అన్నారు. పిల్లలు ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్దగా వినాలని సూచించారు.
కస్టపడి చదివే కన్నా ఇష్టపడి చదవాలని పిల్లలతో అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని తిట్టవద్దని, వచ్చే పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా ఇంటి వద్ద కూడా చదివించాలని కోరారు.
పిల్లలు చదివే విదానాన్ని తల్లిదండ్రులు గమనించాలని అన్నారు. పిల్లలను టివిలకు, మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉంచాలని సూచించారు. పిల్లలు చదువుకునే సమయంలో తల్లిదండ్రులు టివి లను చూడటం మానేయాలని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఒక అడుగు ముందుకు వేయాలని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థుల తల్లితండ్రులు వేసిన రంగవల్లులు పరిశీలించి విజేతలను ఎంపిక చేసిన మంత్రి సంధ్యారాణి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తనకు చదువు చెప్పిన గురువు రెడ్డి సత్య మూర్తి వేదిక పైకి రాగానే గురువు కాళ్ళకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న మంత్రి..విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడలు ఆడి అందరినీ ఆకట్టుకున్నారు