– పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్ షిప్ ను సందర్శించిన మంత్రి నారాయణ
– సుస్ధిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే అంశాలను అధ్యయనం
– డెల్ టెక్నాలజీస్ ప్రతినిధులతో మంత్రి సమావేశం
– సింగపూర్ లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు బృందం పర్యటన
సింగపూర్: అమరావతి నిర్మాణంలో పలు అంశాల్లో సింగపూర్ మోడల్ ను ఫాలో అవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాజధాని మాస్టర్ ప్లాన్ సింగపూర్ ప్రభుత్వం అందించింది. దీంతో పాటు ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ది సాధించేందుకు అవసరమైన అంశాలపై మంత్రి నారాయణ సింగపూర్ లో అధ్యయనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు సింగపూర్ వెళ్లిన మంత్రి నారాయణ. అక్కడి పలు ప్రాంతాలను సందర్శించారు. మంగళవారం ఉదయం సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్ షిప్ ను మంత్రి నారాయణ సందర్శించారు.
పుంగోల్ పాయింట్ కేవ్ సింగపూర్ లోని మొట్టమొదటి ఎకో టౌన్. సముద్ర తీరం లో స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ మొబిలిటీ, కమ్యూనిటీ కేంద్రంగా నిర్మించిన భారీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇది. సుస్ధిర పట్టణాభివృద్ధిలో నూతన విధానాలను పబ్లిక్ హౌసింగ్ కు అనుసంధానం చేయడానికి అవసరమైన వివరాలను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అమరావతి స్మార్ట్ సిటీలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిఫ్ అభివృద్ధికి, వాతావరణ అనుగుణమైన ఇళ్ల నిర్మాణాలు, స్మార్ట్ వాటర్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన అంశాలను మంత్రి నారాయణ అధ్యయనం చేశారు. పుంగోల్ పాయింట్ కేవ్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో తీసుకున్న పలు అంశాలను అమరావతి నిర్మాణంలో ఉపయోగపడతాయని మంత్రి నారాయణ అన్నారు.
ఇక మధ్యాహ్నం సింగపూర్ లోని డెల్ టెక్నాలసీస్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. అమరావతి స్మార్ట్ సిటీని బ్లూ – గ్రీన్ సిటీగా నిర్మించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగినట్లుగానే మాస్టర్ ప్లాన్ కూడా రూపకల్పన చేసి నిర్మాణాలు చేస్తుంది ప్రభుత్వం. అయితే అమరావతిలో నిర్మాణాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇతర నగరాలతో పోటీపడేలా .నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై డెల్ టెక్నాలజీస్ ప్రతినిధులు మంత్రి నారాయణకు వివరించారు.