Suryaa.co.in

Telangana

డ్రిప్ – స్ప్రింక్లర్ యూనిట్లకు రాయితీ

-ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం
-రాయితీ విడుదల చేసినందుకు రైతుల కృతజ్ఞతలు

హైదరాబాద్: సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో-ఆపరేషన్, మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ని ఉద్యానశాఖ అధికారులు మరియు మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

గత సంవత్సర కాలంగా ఆయిల్ పామ్ తోటలు వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాలకు అంతర్ పంటలకు మరియు ఎరువుల యాజమాన్యానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న రాయితీని మరియు డ్రిప్ కంపెనీలకు డ్రిప్ పరికరాలకు సంబంధించి 2022 సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న బకాయిలు రూపాయలు 97 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రైతుల పక్షాన ఉద్యానశాఖ అధికారులు మరియు డ్రిప్ కంపెనీల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

గత రెండు సంవత్సరాల కాలంగా రాయితీలు విడుదల కాకపోవడం వలన ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ అనుకున్నంత మేర జరగలేదని, అదే విధంగా డ్రిప్ కంపెనీలు కూడా బకాయిల మూలంగా రైతులకు సకాలంలో డ్రిప్ యూనిట్లు అందచేసే పరిస్థితి లేకుండా పోయిందన్న విషయం ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తదనుగుణంగా రైతుల ప్రయోజనాలను ముఖ్యంగా ఉద్యాన రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వము పాత బకాయిలు విడుదల చేసిందని మంత్రి తెలిపారు.

రైతులకు ఇబ్బంది కలగకుండా డ్రిప్ యూనిట్లు మంజూరీ అయిన వెంటనే డ్రిప్ ఇన్ స్టలేషన్ ఎప్పటికప్పుడు త్వరిత గతిన పూర్తి చేయాలని ఈ సందర్భముగా మంత్రివర్యులు కంపెనీల ప్రతినిధులను కోరారు. ఇక నుండి నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు.

పండ్లు, కూరగాయ పంటలు, ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నదని, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి, సంబంధిత ప్రోత్సహకాలు రైతులకు అందుబాటులో ఉంచుటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని మంత్రి తెలిపారు. డ్రిప్ – స్ప్రింక్లర్ యూనిట్లను ఇతర పంటలకు కూడా వర్తింపచేసే విధంగా ప్రణాళికలు చేయవల్సిందిగా ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE