– చిత్తూరు జిల్లా నిండ్ర, అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీల రైతులకు బకాయిలు చెల్లించాలి
– అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు చెరుకు రైతులు గుర్తుకు రాలేదా?
– యుగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ ఏమైంది?
– రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం తప్పదు
– బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం
అమరావతి : ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు వెన్నతో పెట్టిన విద్య అని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చెరుకు రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ఇప్పుడు వారిని నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నిండ్రలోని నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ, అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీల సమస్యలపై, చెరుకు రైతుల కన్నీటి వేదనపై రామచంద్రయాదవ్ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
“యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చెరుకు రైతుల కష్టాలు చూసి చలించి తాము అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటామని, ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కల్లబొల్లి హామీలు ఇచ్చారు. ఆ మాటలు నమ్మి ఓట్లేసిన రైతులకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి” అని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతుల సంక్షేమం అంటూనే, కళ్లెదుట నష్టపోతున్న చెరుకు రైతులను విస్మరించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు 13 కోట్లు, రైతులకు 35 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతుంటే, ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.
“రైతులకు, కార్మికులకు న్యాయం చేయకుండా, ఒక ఫైనాన్స్ కంపెనీకి మేలు చేసేలా ఆస్తుల వేలానికి ఎలా అనుమతిస్తారు? ఇది ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు వైఫల్యం కాదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గోవాడ ఫ్యాక్టరీని గతంలో వైసీపీ నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కూడా అడ్డగోలుగా దోచుకున్నారని, ఇప్పుడు అవేమీ పట్టనట్టు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. “ఫ్యాక్టరీ నష్టాలకు కారణమైన మీ పార్టీ నాయకులను వదిలేసి, రైతులను గాలికొదిలేస్తారా? గోవాడ ఫ్యాక్టరీ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, మీ పార్టీ నాయకులతో సహా దోషులు ఎవరైనా శిక్షించే దమ్ము చంద్రబాబుకు ఉందా?” అని ఆయన సవాల్ విసిరారు.